బీజేపీ వ్యూహాత్మక తప్పిదాలు!

అతి ఆత్మ విశ్వాసంతో అసలుకే ఎసరు తెచ్చుకునే పనిలో బీజేపీ బిజీగా ఉందా అనే అనుమానం కలుగుతోంది. ఒక భారీ విజయం కొండంత ఆత్మ విశ్వాసాన్నిస్తుంది. బీజేపీ చరిత్రలో మొదటిసారిగా లోక్ సభలో పూర్తి మెజారిటీతో విజయ దుందుభిని మోగించడానికి ప్రధాన కారణమైన హీరో, నరేంద్ర మోడీ.
ఆ తర్వాత నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగింది. ఢిల్లీలో సీన్ రివర్సయింది. ఢిల్లీకా భగోడా అని అరవింద్ కేజ్రీవాల్ మీద దుమ్మెత్తి పోసి, కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించి కమలాన్ని వికసింప చేయాలన్న వ్యూహం బెడిసికొట్టింది. కేజ్రీవాల్ పై మితిమీరిన నెగెటివ్ ప్రచారం బీజేపీ కొంప ముంచింది.
తామేం చేస్తారో చెప్పకుండా ప్రత్యర్థిని తిట్టడమే పనిగా పెట్టుకోవడం ప్రజలను ఆకర్షించలేదు. అందుకే ఢిల్లీలో చావుదెబ్బ తప్పలేదు. ఇప్పుడు బీహార్లో కూడా అదే తప్పు చేయడానికి బీజేపీ సిద్దమైనట్టు కనిపిస్తోంది. బీహార్లో నిర్వహిస్తున్న బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో నితీష్ ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు.
ప్రజలకు ఉజ్వల భవిష్యత్తుపై భరోసా ఇస్తేనే అధికారం దక్కుతుంది. 2005లో బీజేపీ, జేడీయూ కూటమి బీహార్లో చేసిందదే. అందుకే, ఈ కూటమికి ప్రజలు పట్టం కట్టారు. 2010లోనూ మరోసారి ఈ కూటమిని అధికారం వరించింది. ఒక్కసారి గత ఎన్నికల ఫలితాల సరళిని గమనిస్తే, పాజిటివ్ ప్రచారం ప్రభావం ఎంతో తెలుస్తుంది.
బీజేపీతో కలిసి పోటీ చేసిన జేడీయూ సీట్లు 88 నుంచి 122 కు పెరిగాయి. బీజేపీ అయితే రికార్డుల మోత మోగించింది. 2005లో 55 సీట్లు గెలిస్తే, 2010లో ఏకంగా 94 సీట్లను కైవసం చేసుకుంది. లాలు యాదవ్ పార్టీ ఆర్జేడీ 54 నుంచి 22 సీట్లకు పడిపోయింది. ప్రజలకు నమ్మకం కలిగిస్తే అదీ ఫలితం. ఇప్పుడు జేడీయూ బీజేపీతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో జత కట్టింది.
లాలు, నితీష్ కూటమి చాలా బలమైంది. దానిపై గెలవాలంటే, తాను ఏంచేస్తాననేది బీజేపీ వివరంగా చెప్పాలి. అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు రావాలి. పక్కా ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడున్న ప్రభుత్వం విఫలమైన రంగాల్లో తాను ఏ విధంగా సత్ఫలితాను సాధిస్తానో ప్రజలకు వివరించి నమ్మించ గలగాలి. 2005లో నితీష్, బీజేపీ చేసిందిదే.
కానీ, నితీష్ ను, లాలును తిట్టడమే పనిగా పెట్టుకుంది బీజేపీ. మొన్న పాట్నాలో ఆర్భాటంగా పెట్టిన సభలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు ప్రత్యర్థులపై విమర్శలకే అధిక సమయం వెచ్చించారు. కేంద్రంలో ఇప్పుడున్న ప్రభుత్వ పథకాలను వల్లెవేయడం కాదు. బీహార్లో ఏం చేస్తారనేది ముఖ్యం. ఈ విషయాన్ని గుర్తించకపోతే, ఢిల్లీలో ఎదురైన చేదు అనుభవం బీహార్లోనూ తప్పక పోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *