
తెలంగాణ శాసనసభలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్, ప్రతిపక్షంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క మధ్య ఆసక్తికర సంభాషణ సాగింది. మంగళవారం ఈటెల రాజేందర్ బడ్జెట్ పై మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు టీఆర్ఎస్ కారణమని.. కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేయక తప్పించుకున్నారని.. అందుకే ప్రజలు వారిని తిరస్కరించారని అన్నారు.
దీనిపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర ఏమీ లేదన్నారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు పాస్ చేయించింది కాంగ్రెస్ పార్టీయేనని.. తాను డిప్యూటీ స్పీకర్ గా చైర్ ఉండి బిల్లు పాస్ చేయించానని భట్టి పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చింది అధినేత్రి సోనియా, కాంగ్రెస్ లేనని పేర్కొన్నారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు తనను ఈటెల, హరీష్ వచ్చి తెలంగాణ బిల్లు పాస్ అయ్యేలా సహకరించాలని బతిమిలాడింది వాస్తవం కాదా అని భట్టి విక్రమార్క ఈటెలను ప్రశ్నించారు. మరి తెలంగాణ ఏర్పాటు కు కారణం ఎవరని ఈటెలను ప్రశ్నించారు.
అనంతరం ఈటెల మాట్లాడుతూ ఇచ్చింది సోనియా కాంగ్రెస్, తెచ్చింది టీఆర్ఎస్ అని చెప్పి ముగించారు.