
హైదరాబాద్, ప్రతినిధి :
అవును.. ఈ తెలంగాణ రాజ్యంలో ఇప్పడు బావ, బావమరుదులదే నడుస్తోంది. కీలక శాఖలు వీరివద్దే ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘మిషన్ కాకతీయ’ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ చేతిలో ఉంది. దీనికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చి దాదాపు 50 వేల కోట్లకు పైగా వెచ్చించడానికి సిద్దమవుతుంది. ఇక ప్రభుత్వం ఎంచుకున్న రెండో రంగం.. పంచాయతీ, గ్రామాల అభివృద్ధి.. ఐటీ.. ఈ రెండు కేటీఆర్ చేతిలో ఉన్నాయి.. దీంతో మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఖర్చు పెట్టే డబ్బులన్నీ.. మోస్తారుగా ఈ ఇద్దరు బావ, బావమరుదుల చేతుల్లోనే ఉండడం యాదృచ్ఛికంగా జరిగినా.. అభివృద్దిలో వీరు భాగస్వామ్యం మాత్రం 100శాతం ఉండబోతోంది..
ఇప్పటికే హరీష్ మిషన్ కాకతీయపై యుద్ధం ప్రకటించి.. ఓ సినిమాను తీసి.. ప్రవాస భారతీయులను కదిలించి పెద్ద ఎత్తున ఫోకస్ చేసి నిధులను రాబడుతూ దూసుకెళ్తున్నారు. మరో వైపు దేశంలోనే మెరుగైన ఐటీ పాలసీని తెచ్చి దాన్ని ఇంప్లీమెంటు చేయడంలో కేటీఆర్ ముందుండి నడిపిస్తున్నారు.పంచాయతీ శాఖ కూడా ఆయనదే కావడంతో ఇక పల్లె నుంచి పట్నం వరకు నిధుల వరదలా ఆయనే కీలకం..
ఇలా ఇప్పడు బావ, బావమరుదులు తెలంగాణ ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తున్నారు. మరి బావ ముందు.. బావ మరిది ముందా? అని అడక్కండే.. అది ఐదేళ్ల తర్వాతే తెలుస్తుంది. వీరి పాలన ముగిసేది అప్పడే కదా.?