
కరీంనగర్, ప్రతినిధి : జిల్లాలోని ప్రభుత్వాసుపత్రిలో ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన బంధువులు..కుటుంబసభ్యులు ఎంతో ఆనందించారు. కానీ ఒక్కసారే అక్కడ ఆర్తనాదాలు వినిపించాయి. మగబిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి కన్నుమూసింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువులు..కుటుంబసభ్యులు ఆరోపించారు. తీవ్ర కోపోద్రిక్తులై ఆసుపత్రిపై దాడి చేశారు.
వివారాల్లోకి వెళితే…మల్లాపూర్ మండలం వివిరావుపేట గ్రామానికి చెందిన అన్నపు విజయ ప్రసవం కొరకు ప్రభుత్వాసుపత్రిలో చేరింది. అయితే నార్మల్ డెలీవరి కోసం వైద్యులు ప్రయత్నించగా రక్తస్రావం అధికమైంది. అనంతరం విజయ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిలోని ఫర్నీచర్, అద్దాలు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేసి ఆందోళన నిర్వహించారు. దీంతో ఆసుపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఆసుపత్రివద్దకు చేరుకొని పరిస్థితిని అదుపుచేశారు.