బాధిత జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన టీయుడబ్ల్యుజె

*బాధిత జర్నలిస్టు కుటుంబానికి అండగా నిలిచిన టీయుడబ్ల్యుజె*

*?రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరీ*
*?సహాయ నిధి నుండి మరో లక్ష*
*?భార్యకు పెన్షన్*
———————————————–
అకస్మాత్తుగా కుటుంబ పోషకుడిని కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్న…
ఆ బాధిత జర్నలిస్టు కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె-ఐజేయు) అండగానిలిచింది…కన్నీళ్లు తూడ్చి ఓదార్చింది…అంతేకాదు వారి భవిష్యత్తుకు మార్గాన్ని అన్వేషించింది.. ఆ దిశలోనే తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది…ఎట్టకేలకు తన కృషి ఫలించడంతో ఆ కుటుంబానికి జీవనాధారం కల్పించి దీవెనలు అందుకుంది…కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏబీఎన్ ఛానెల్ కు రిపోర్టర్ గా పనిచేస్తున్న డ్యాగల సుభాష్ (39) గత ఏడాది జూలై 7న, హైదరాబాద్ వైపు వస్తుండగా, మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడు. అతనికి భార్య, చిన్నారులైన ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అంతేకాదు ఆ వృద్ధ, తల్లి దండ్రులకు సుభాష్ ఏకైక కుమారుడు. అతని ఆకస్మిక మృతితో ఆ కుటుంబానికి దిక్కెవరూ లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో టీయుడబ్ల్యుజె కామారెడ్డి జిల్లా శాఖ స్పందించి ఆ కుటుంబానికి చేదోడుగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కల్పించిన జాతీయ భీమా పథకం నుండి సుభాష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే బాధ్యతలను టీయుడబ్ల్యుజె కామారెడ్డి జిల్లా బాధ్యులు చేపట్టి, దానికి కావలసిన డాక్యుమెంట్లన్నీ సిద్ధం చేసి యూనియన్ రాష్ట్ర నాయకుల సహకారంతో నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి అందించారు. దీంతో రాష్ట్రంలో ఈ భీమా పథకం ప్రారంభమైన రెండేళ్లలో రెండవ లబ్దిదారుడిగా సుభాష్ కుటుంబానికి 5 లక్షల రూపాయలను మంజూరీ చేయించడం అభినందనీయం. అంతేకాదు జర్నలిస్టుల సహాయ నిధి నుండి మరో లక్ష రూపాయలు, మృతుడి భార్యకు పెన్షన్ మంజూరీ చేయించిన ఘనత కామారెడ్డి జిల్లా శాఖకు దక్కింది. ఇవ్వాళ కామారెడ్డి లో, టీయుడబ్ల్యుజె-ఐజేయు జిల్లా శాఖ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యుజె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీల చేతులమీదుగా నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్థిక సహాయం మంజూరీ పత్రాన్ని సుభాష్ భార్య ఉమాశ్రీ కి అందించారు. ఈ సందర్బంగా టీయుడబ్ల్యుజె కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు
ఎస్. ఏ. లతీఫ్, బెల్లపు గోపిలను వారు అభినందించారు.

నాగశ్రీ కి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి పోచారం
——————————–
టీయుడబ్ల్యుజె-ఐజేయు నాయకుల అభ్యర్థన మేరకు, మానవతా దృక్పథంతో సుభాష్ సతీమణి నాగశ్రీ కి ఉద్యోగం కల్పిస్తామని మంత్రి పోచారం హామీ ఇచ్చారు. ఆమె హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసినందున కస్తూరిబా గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా నియమించేందుకు చర్యలు చేపట్టాలని అక్కడే ఉన్న జిల్లా కలెక్టర్ సత్యనారాయణను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *