
శ్రీనగర్, ప్రతినిధి : కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్థాన్ మరోసారి సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతోంది. జమ్మూకాశ్మీర్‌లోని సాంబ, కతువా జిల్లాలోని భారత ఆర్మీ పోస్టులపై భారీగా కాల్పులు…మోర్టార్లతో దాడి చేస్తూ తీవ్ర ఉద్రిక్తతను సృష్టించింది.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి కాల్పులు జరుపుతున్న పాకిస్థాన్‌కు భారత సైన్యం ధీటుగా జవాబిచ్చింది. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు పాకిస్థాన్ రేంజర్లు మృతి చెందినట్టు భారత సైన్యం ప్రకటించింది. పాక్ మోర్టార్ల దాడిలో నలుగురు పౌరులు చనిపోయారు. కాల్పులతో భారత సైన్యం దృష్టి మళ్లించి కార్గిల్ గుండా దేశంలోకి చొరబడడానికి పెద్ద ఎత్తున పాక్ సైన్యం కుట్ర పన్నినట్టు సైనిక వర్గాలు హోం మంత్రికి తెలియజేశాయి.
పాక్ సేనలకు గట్టిగా సమాధానం చెప్పాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు. కాల్పులతో భయాందోళనకు గురైన సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు దూర ప్రాంతాలకు తరలివెళ్తున్నారు.