
అది అర్థరాత్రి 12 గంటల సమయం.. అమావాస్య.. కారుచీకట్లు ఆకాశాన్ని నల్లగా మార్చేశాయి.. చంద్రుడు చాయ ఇసుమంతైనా లేని కటిక రాత్రి.. ఆ రాత్రి ఒంటిపై నూలుపోగు లేకుండా.. ఎగురుతూ గెంతుతూ చేతిలో నిమ్మకాయలు.. ఒంటిపై పసుపు కుంకుమ.. ఓ మగమనిసి రోడ్డుపై వెళుతున్నాడు.. కొద్ది దూరంలో కనిపించిన ఆ ప్రతిబింబంతో ఒక్కసారిగా బండికి బ్రేకులు పడ్డాయి.. బండిలైట్ వెలుతురు చూసి ఆ వ్యక్తి పక్కకు వెళ్లిపోయాడు..
మంత్రాలు.. ఇప్పుడు గ్రామంలో పుట్టుకొచ్చిన నయా ఉపాధి.. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రాల నెపం ఎక్కువ.. మండలంలోని సీతారాంపూర్ లో ఓ నడివయసు వ్యక్తి మంత్రాలను చేయడాన్నే ఉపాధిగా ఎంచుకున్నాడు.. అమావాస్య, పౌర్ణమి ముఖ్యంగా ఆది, గురువారాల్లో బట్టలు లేకుండా అర్ధరాత్రి బయటకు వచ్చి చేతులో నిమ్మకాయలు, పసుపు కుంకుమ పోసుకొని ఊరికి దూరంగా శ్మశాన దిబ్బల్లో ముగ్గులు గీసి మంత్రాలు నేర్చుకుంటున్నాడు..
అర్ధరాత్రి బండిపై వెళుతున్న వారు.. వ్యవసాయ కరెంట్ పెట్టే వాళ్లకు ఈ మంత్రగాడి మంత్రాంగం తెలిసి హడలిచస్తున్నారు. ఇటీవలే సీతారాంపూర్ గ్రామంలో ఓ రైతు బంజరుదొడ్డి వద్ద ఇలాగే మంత్రాలు చేశాడట.. తెల్లవారేసరికి అక్కడ ఓ ఆవు చనిపోయింది.. ఇదంతా చూసి గ్రామస్థులు సైతం మంత్రగాడు తమకు ఏం చేస్తాడో అని ఈ విషయం ఎవరూ బయటకు చెప్పడం లేదు.. దీంతో మంత్రగాడి బరివాత చేష్టలు ఎక్కువయ్యాయి..
మంత్రాలకు చింతకాయలు రాలని ఈ కాలంలో మంత్రాలున్నాయంటే అదో జోక్.. కానీ పేదల, అమాయకులను ఆసరా చేసుకొని ఇలాంటి మంత్రగాళ్లు పుట్టుకొస్తూనే ఉన్నారు. పోలీసులు వీరి పని పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది..