బయటి నేతలతో కిక్కిరిసిన ఓరుగల్లు టీఆర్ఎస్

9939_Basavaraj_Saraiah_KCR

ఓరుగల్లు కారు ఇప్పుడు నాయకులతో ఫుల్లు అయ్యింది. టీఆర్ఎస్ లో మొదటి నుంచి ఉన్నవాళ్లతో కాదు.. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వాళ్లతో ఇప్పుడు కలగాపులగం అయ్యింది.. వరంగల్ లో బలమైన ప్రతిపక్ష నాయకులు లేకుండాపోయారు.. ఇన్నాళ్లు టీడీపీ శాసనసభా పక్ష నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు టీఆర్ఎస్ లో చేరడంతో టీఆర్ఎస్ బలంగా తయారైంది. ఇప్పుడు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బస్వరాజు సారయ్య సైతం టీఆర్ఎస్ లో చేరడంతో టీఆర్ఎస్ కు తిరుగు లేకుండాపోయింది.. ఈ తీరుగా టీఆర్ఎస్ బలపడుతుండడంతో వరంగల్ లో ఇక ప్రతిపక్షమే లేకుండాపోయింది..

కాగా ఓరుగల్లు ఇప్పుడు ఫుల్లుగా నేతలతో కిక్కిరిసి పోయింది.. ఎవరినీ ఎక్కడ కేటాయించాలో కూడా కేసీఆర్ కు తెలియని పరిస్థితి నెలకొంది.. గడిచిన 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు నాయకుల కొరత తీవ్రంగా ఉండేది.. అప్పుడే టీఆర్ఎస్ లో చేరిన కడియం శ్రీహరి రాకతో వరంగల్ రాజకీయాల్లో టీఆర్ఎస్ లో ముసలం మొదలైంది. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యకు , కడియం పడలేదు.. ఆ తరువాత వైసీపీ నుంచి కొండా సురేఖ-మురళీ చేరడంతో కీచులాటలు పెద్దవి అయ్యాయి. ఇప్పుడు కాంగ్రెస్ నేత సారయ్య రాకతో టీఆర్ఎస్ లో మరోసారి అలజడి రేగింది. ఇప్పటికే రాజయ్య, కడియంలకు పడడం లేదు.. ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన కొండా సురేఖకు బస్వారాజు సారయ్య రాకతో ఇబ్బందులు ఎదురయ్యాయి. పశ్చిమ నుంచే గడిచన ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కొండా మురళి.. కాంగ్రెస్ నుంచి సారయ్య పోటీచేశారు.. ఇప్పుడు వీరిద్దరిని ఎక్కడ సర్దుబాటు చేస్తారో కేసీఆర్ కు తెలియాలి..వరంగల్ లో ఇప్పుడు టీఆర్ఎస్ లో నాయకుల సంఖ్య పెరిగింది. అధికారంలో ఉండడంతో బాగా కలిసి వచ్చినా భవిష్యత్తులో సీట్ల సర్దుబాటు ప్రొటోకాల్స్ విషయంలో టీఆర్ఎస్ కు చిక్కులు తప్పేలా లేవు..