బజాజ్ కమిటీ ముందు టి.ఎస్. ప్రభుత్వ వాదనలు

*నాడూ – నేడూ సాగునీటిలో తెలంగాణకు అన్యాయమే.

*సొంత రాష్ట్రంలోనూ తిప్పలు.

*న్యాయం చేయని ట్రిబ్యునళ్ళు.

*పోలవరం, పట్టిసీమ లలో మా వాటా మాకు రావాలి.

*ఉమ్మడి ప్రాజెక్టుల జాబితా లో జూరాల ను చేర్చడం విడ్డూరం.

* కెఆర్ఎంబి వైఖరిపై టిఎస్ ఆక్షేపణ.

*పులిచింతల, సుంకేశుల ఉమ్మడి జాబితాలో చేర్చాలి.

*మాపైన బజాజ్ కమిటీ సానుభూతి చూపాలి.

*జరిగిపోయిన అన్యాయాన్ని సరిదిద్దాలి.

*బజాజ్ కమిటీ ఏర్పాటు కృష్ణా వివాదంలో కేంద్రం ముందడుగు .

———————

తరతరాలుగా తెలంగాణకు కృష్ణా నీటి వాటాలో జరుగుతున్న అన్యాయాన్ని కేంద్ర ప్రభుత్వ కమిటీ కి తెలంగాణ ప్రభుత్వం వివరించింది. దీనికి సంబంధించి గణాంకాలతో సహా వివరాలను కమిటీ ముందుంచింది. టి.ఎస్. ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జోషి సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల నిర్వహణ వివాదాలపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన బజాజ్ కమిటీ సోమవారం నాడు తెలంగాణ ప్రభుత్వ ఉన్నాధికారులతో సమావేశమైంది. ఐదుగురు సభ్యులతో కూడిన ఈ బృందం బుధవారం వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలలో పర్యటిస్తుంది.

కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతున్నట్టు టి.ఎస్. వాదించింది.

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నిర్వహణ, ఆపరేషనల్ ప్రొసీజర్స్, గోదావరి నుంచి పోలవరం, పట్టిసీమ ద్వారా మళ్లిస్తోన్న కృష్ణా జలాల అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర జల సంఘం మాజీ అధ్యక్షుడు ఎ.కె. బజాజ్ నాయకత్వంలో ఒక కమిటీని కేంద్రం నియమించింది. సాక్ష్యాధారాలతో సహా తెలంగాణ ప్రభుత్వం చూపిన లెక్కలతో బజాజ్ కమిటీ నివ్వెర పోయింది. ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందున్న పరిస్థితి, సాగునీటి రంగంలో హైదరాబాద్ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమాలు, పధకాలను టి.ఎస్. అధికారులు వివరించారు. ఎపి ఆవిర్భావం తర్వాత గత పధకాలను తుంగలో తొక్కిన వైనాన్ని తెలిపారు. 1956 నుంచి 2014 వరకు జరిగిన వివక్షను వివరిస్తూ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కూడా న్యాయం జరగకపోవడాన్ని టి.ఎస్. ప్రస్తావించింది. ఇంతకుముందు చేపట్టిన సాగునీటి పథకాలన్నిటినీ యధాతధంగా అమలు చేయాలని ఎపి పునర్విభజన చట్టంలో ఉన్నా ఇష్టానుసారంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగిందని టి- ఎస్ తెలిపింది.

రెండు రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకొని కృష్ణా బోర్డుకు సరైన విధివిధానాలు రూపొందించాలని తెలంగాణ కోరింది. హైదరాబాద్ ప్రభుత్వం కృష్ణా బేసిన్ లో గతంలో రూపొందించిన అప్పర్ కృష్ణా, బీమా, తుంగభద్ర ప్రాజెక్టుల ద్వారా 174 టిఎంసిల నీటిని తెలంగాణ కోల్పోయిందని టిఎస్ ప్రభుత్వం తెలిపింది. బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునళ్ల ముందు తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఉమ్మడి ఎపి సర్కారు సమర్ధంగా వాదించలేదని టి,ఎస్. విమర్శించింది. అంతర్జాతీయంగా సాగునీటి కేటాయింపులు, పంపిణీకి సంబంధించి అమలులో ఉన్న సహజ న్యాయసూత్రాలను ఎపి ఉల్లంఘించినట్టు టిఎస్ ఆరోపించింది. క్యాచ్ మెంటు, సాగు యోగ్య భూములు, పేదరికం, వెనుకబాటుతనం , జనాభా తదితర అంశాలలో ఏ ప్రాతిపదికన, ఏ ప్రమాణాలతో చూసినా ఎపికి కేటాయించిన 811 టీఎంసీలలో తెలంగాణకు 450 టిఎంసీలు రావలసి ఉందని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది.తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడినా సాగునీటి రంగంలో అన్యాయం కొనసాగుతోందని బజాజ్ కమిటీ ఎదుట టిఎస్ ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగి మూడేళ్ళు కావస్తున్నా కృష్ణాలో తెలంగాణలో వాటా తేలలేదని ప్రభుత్వం తెలిపింది. 29 9:51 2 నిష్పత్తి ప్రకారం 2015లో రెండు రాష్ట్రాల మధ్య తాత్కాలికంగా పరస్పర అంగీకారం కుదిరిందని టిఎస్ గుర్తు చేసింది. దీని ప్రకారం కృష్ణా ప్రాజెక్టుల ‘ఆపరేషనల్ ప్రోటొకాల్ ‘ ను రూపొందించాలని బజాజ్ కమిటీని తెలంగాణ ప్రభుత్వం కోరింది. పోలవరం, పట్టిసీమల ద్వారా గోదావరి ని కృష్ణా నదికి మళ్ళిస్తున్నందున గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య ఆ నీటిని పంపిణీ చేయాలని టిఎస్ కోరింది. పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా నదికి తరలిస్తున్న 80 టిఎంసీల గోదావరి జలాలలో 45 టీఎంసీల ను ట్రిబ్యునల్ ఉమ్మడి ఎపికి కేటాయించిందని టిఎస్ తెలిపింది. అయితే వీటిని నాగార్జున సాగర్ ఎగువన ఉన్న ప్రాంతాలలో రెండు రాష్ట్రాలలోనూ సాగు యోగ్య భూమి ఎంత ఉన్నదో లెక్కగట్టి నీటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం కోరింది. ఈ యేడాది పట్టిసీమ ప్రాజెక్టు నుంచి 53 టిఎంసీల గోదావరి జలాలను కృష్ణానదికి మళ్లించినట్టు ఎపి నిర్ధారించినందున ఇందులోనూ తెలంగాణ వాటా ఖరారు చేయాలని బజాజ్ కమిటీ ని కోరింది. పట్టిసీమ లోనూ న్యాయబద్ధమైన నీటి పంపిణీ జరగాలని టిఎస్ కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల జాబితాలో కెఆర్ ఎంబి జూరాల ను చేర్చడం పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ఆ క్షేపించింది. పులి చింతల, సుంకేశుల ప్రాజెక్టులను ఉమ్మడి జాబితాలో చేర్చాలని టిఎస్ సూచించింది. బజాజ్ కమిటీ తమ సమస్యను సానుభూతితో పరిశీలించవలసిందిగా కోరినట్టు సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ప్రభుత్వ ఇరిగేషన్ అడ్వయిజర్ ఆర్. విద్యాసాగరరావు తెలిపారు. బజాజ్ కమిటీ ఎటువంటి సమాచారం కోరినా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు.

ఎకె బజాజ్ కమిటీ ఛైర్మన్, సిడబ్ల్యు, సి మాజీ అధ్యక్షడు ఎ.కె. బజాజ్, సభ్యులు డి కె. మెహతా (CWc మాజీ సి.ఇ), రూర్కీ కి చెందిన NIH శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ పి. పాండే, CEA సి . ఇ ప్రదీప్ కుమార్ శుక్లా,C WC హైడ్రాలజీ డైరక్టర్ ఎన్ఎన్ రాయ , కెఆర్ ఎంబి చైర్మన్ Sk హల్దర్, కెఆర్ ఎంబి సభ్య కార్యదర్శి డాక్టర్ సమీర్ ఛటర్జీ , తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్ సి ఎస్. జోషి, ఇఎన్సి మురళీధరరావు , సిఇలు ఖగేందర్ రావు, సునీల్, ఓఎస్ డి శ్రీధర్ రావు దేశ్ పాండే , అంతర్రాష్ట్ర నీటి వనరుల అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *