
బోఫాల్, ప్రతినిధి : ల్యాండింగ్ రన్ వే ఒకటే ఉండడంతో మధ్యప్రదేశ్ సీఎం విమానాన్ని పక్కకు తోయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రయాణించిన ప్రత్యేక విమానాన్ని రన్‌వే మీదికి చేర్చడానికి పోలీసులు, అధికారులు, ఆయన భద్రతా సిబ్బంది ఓ పట్టు పట్టాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు చౌహాన్ సోమవారం విమానంలో అక్కడికి చేరుకున్నారు.
అయితే కొద్దిసేపటికే కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కూడా చింద్వారాకు విమానంలో రావడంతో సమస్య వచ్చిపడింది. ఆయన ప్రయాణించిన విమానం కిందికి దిగడానికి అనువుగా ఇలా చౌహాన్గారి ప్లేన్‌ని పక్కకు జరపాల్సి వచ్చిందట.. అరగంట తరువాత కమల్‌నాథ్ ప్లేన్ అదే ఎయిర్ స్ట్రిప్ మీదికి చేరుకుంది. సుమారు ఇరవై నిముషాలపాటు వీళ్ళంతా పొలోమంటూ చౌహాన్ విమానాన్ని హెలిపాడ్ వద్దకు తోయాల్సి వచ్చింది. రోడ్షోతోబాటు తన సత్కార కార్యక్రమంలో పాల్గొనేందుకు చౌహాన్ చింద్వారా చేరుకున్నారు. అక్కడి ఎయిర్ పోర్టు చిన్నదిగా ఉండడం వల్ల, పార్కింగ్ సమస్య కారణంగా ఇలా చౌహాన్ విమానానికి చిక్కులు తలెత్తినట్టు తెలుస్తోంది.