
ప్రశాంతమైన ఫ్రాన్స్ లో కాల్పుల కలకలం. ఫ్యాషన్ల రాజధాని ప్యారిస్ లో ఉగ్రవాదుల దాడి. చార్టీ హెబ్దో అనే మ్యాగజీన్ కార్యాలయంపై ఏకే 47 లతో దాడి చేసిన ఉగ్రవాదులు, 12 నిండు ప్రాణాలను బలిగొన్నారు. మరణించిన వారిలో జర్నలిస్టులు, కార్టూనిస్టులు, ఇద్దరు పోలీసులు ఉన్నారు. ముసుగులు ధరించిన ఉగ్రవాదులు హటాత్తుగా వారపత్రిక ఆఫీసుపై విరుచుకు పడ్డారు. పట్ట పగలు, నిమిషాల్లో తమ పనిని పూర్తి చేసి కారులో పారిపోయారు.
వ్యంగ్య రచనలు, కార్టూన్ల ద్వారా సెటైర్లు వేయడంలో ఈ వారపత్రికకు ఎంతో పేరుంది. ఎవరి మీదైనా వ్యంగ్య వ్యాఖ్యలు చేయడంతో తరచూ వివాదాస్పదం అవుతుంది. గతంలో మహమ్మద్ ప్రవక్తపై, ఐసిస్ నాయకుడిపై కార్టూన్లు, వ్యంగ్య వ్యాసాలు ప్రచురించింది. దీంతో ఐసిస్ ఉగ్రవాదులు కక్ష గట్టి కాల్పులు జరిపారు.
ఐరోపా ఖండంలో, అందులోనూ ఫ్రాన్స్ లో ఇలాంటి ఘటన జరగడం సంచలనం కలిగించింది. దీంతో ఐరోపా, అమెరికాలు అప్రమత్తమయ్యాయి. తమ దేశంలో దాడులు జరిగితే అడ్డుకోవడానికి భద్రతను కట్టుదిట్టం చేశాయి. మరోవైపు, మ్యాగజీన్ పై దాడి చేసి పారిపోయిన ఉగ్రవాదులు మళ్లీ ఎక్కడ ఎప్పుడు కాల్పులు జరుపుతారో అని ఫ్రాన్స్ ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.