
ఫ్రెంచి ప్రజలకు మూడు రోజులు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఉగ్రవాద దాడుల ఎపిసోడ్ సుఖాంతమైంది. మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. ఓ మహిళా బందీతో సహా ప్రింటింగ్ ప్రెస్ గోదాంలో దాక్కున్న ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు కాల్చిచంపారు. అన్నదమ్ములైన వీరిద్దరూ నేరచరిత గల అల్ ఖైదా ఉగ్రవాదులు. చార్లీ హెబ్దా మ్యాగజీన్ పై దాడికి ప్లాన్ చేసింది, అమలు చేసిందీ వీరే. అలాగే తూర్పు ప్యారిస్ లోనే ఓ కూరగాయల సూపర్ మార్కె్ట్ లో చొరబడి ప్రజలను బందీలుగా పట్టుకున్న మరో ఉగ్రవాదిని కూడా పోలీసులు కాల్చి చంపారు. అయితే, అతడి చేతిలో నలుగురు బందీలు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన వారిని పోలీసులు సురక్షితంగా బయటకు పంపారు.
శుక్రవారం నాడంతా హైడ్రామా నడిచింది. ఉదయం ఈశాన్య ప్యారిస్ లో పోలీసుల కంటబడ్డ కౌచి బ్రదర్స్ టెర్రరిస్టులను వెంబడించారు. వారు ఓ కారును హైజాక్ చేసి అందులో పారిపోయారు. అందులో ఉన్న ఓ మహిళను బందీగా పట్టుకున్నారు. కారులోంచి కాల్పులు జరుపుతూ పారిపోవడానికి ప్రయత్నించారు. వందల సంఖ్యలో పోలీసు వాహనాలు, ఆకాశ మార్గంలో హెలికాప్టర్లు ఆ కారును వెంబడించాయి.చివరకు కారు ఓ ప్రింటింగ్ ప్రెస్ గోదాంలోకి దూరింది. అక్కడ బందీని అడ్డుపెట్టుకున్న ఉగ్రవాదులు, తాము వీరమరణం పొందుతామంటూ నినాదాలు చేశారు.
ఈలోగా తూర్పు ప్యారిస్ లో మరో కాల్పుల కలకలం. ఓ గ్రాసరీ షాపులో ప్రవేశించిన ఉగ్రవాది కాల్పులు జరుపుతూ పలువురిని బందీలుగా పట్టుకున్నాడు. కౌచి బ్రదర్స్ ను పోలీసులు చంపేస్తే తాను ఈ బందీలను చంపుతానని బెదిరించాడు. కొన్ని గంటల పాటు అలా హైడ్రామా జరిగింది. చివరకు రెండు చోట్ల ఒకేసారి పోలీస్ ఆపరేషన్ మొదలైంది. పోలీసులు పెద్ద సంఖ్యలో లోపలికి చొరబడి కాల్పులు జరిపారు. కౌచి బ్రదర్స్ ను హతమార్చారు. బందీగా ఉన్న మహిళను కాపాడారు. గ్రాసరీ షాపులోనూ ఉగ్రవాదిని పోలీసులు కాల్చి చంపారు. అంతము ముందు ఉగ్రవాది కాల్పుల్లో నలుగురు బందీలు హతమయ్యారు. మిగతా వారు క్షేమంగా బయటపడ్డారు. అయితే, మరో మహిళా ఉగ్రవాది పరారీలో ఉందని భావిస్తున్నారు. ఆమె కోసం వేటాడుతున్నారు.