
తూర్పుగోదావరి, ప్రతినిధి : సులభంగా డబ్బులు సంపాదించాలని ఓ ఘనుడు ఏకంగా ప్రజాప్రతినిధులకు టోకరా ఇచ్చాడు. వారి వద్ద నుండి లక్షల రూపాయలు దండుకున్నాడు. ఫ్యాన్సీ సెల్ నెంబర్ లు ఇస్తానంటూ లక్షలు వసూలు చేసి చివరకు పోలీసులకు చిక్కాడు.
ఫ్యాన్సీ నెంబర్లు అంటూ మోసం..
ఈ హైటెక్ మోసగాడి పేరు మద్దెల దీపక్. ఊరు తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం వేమగిరి. ఈజీగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. బాగా డబ్బున్నోళ్ళనే టార్గెట్‌గా ఎంచుకున్నాడు. కొంతమంది సెలబ్రెటీస్‌తో తాను కలిసి దిగిన ఫోటోలను ఫేస్బుక్లో అప్లోడ్ చేసి కొత్త వాళ్లతో పరిచయం పెంచుకున్నాడు. కొంతమంది పొలిటికల్ లీడర్లకు తన దగ్గరున్న ఓ ఫ్యాన్సీ నెంబర్‌తో మిస్డ్ కాల్ లేదా ఎమ్టీ మెసేజ్ పంపి తాను ఎయిర్టెల్ కంపెనీ సీఈఓ అని ఫ్యాన్సీ నెంబర్లను కేటాయించేందుకు తమ సిబ్బందికి ఫోన్ చేయబోయి.. పొరపాటున మీకు చేశానంటూ నమ్మించాడు.
లక్షల రూపాయల మోసం..
దీపక్ మాటలు నమ్మిన ఎమ్మెల్యేలు ఫ్యాన్సీ నెంబర్లపై మోజుతో తమకు కూడా ఫ్యాన్సీ నెంబర్లు కావాలని అడగడంతో కొంత మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని దీపక్ చెప్పేవాడు. అకౌంట్ నెంబర్ తనది కాకుండా ఫ్రెండ్‌ది ఇచ్చేవాడు. దీపక్ మాటలు నమ్మిన ఐదుగురు ప్రజాప్రతినిధులు అతనిచ్చిన అకౌంట్లో లక్షల రూపాయల డబ్బులు జమ చేశారు. ఎంతకూ ఫ్యాన్సీ నెంబర్లు రాకపోవడంతో బాధితులు ప్రకాశం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వలపన్నిన పోలీసుల ఎట్టకేలకు నిందితుడు దీపక్‌ను అరెస్ట్ చేశారు. ఇతని నుంచి స్పోర్ట్స్ బైక్, ల్యాప్‌టాప్,12 లక్షల విలువైన బంగారం, డబ్బు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.