ఫిబ్రవరి 29 లోగా మిషన్ కాకతీయ రెండవ విడత అంచనాలు పంపాలి: మంత్రి టి.హరీష్ రావు

కరీంనగర్: మిషన్ కాకతీయ రెండవ విడత చెరువులలో పూడికతీత పనులు మంజూరుకు సంబంధించిన అంచనాలను ఫిబ్రవరి 29 లోగా పంపించాలని రాష్ట్ర్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు అన్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లతో మిషన్ కాకతీయ, గోడౌన్ల నిర్మాణం, ప్రాజెక్టుల భూ సేకరణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మిషన్ కాకతీయ రెండవ విడతకు సంబంధించి జిల్లాల నుండి ఇంతవరకు 8,200 చెరువులకు అంచనాలు అందాయని ఇంకను 200 చెరువులకు అంచనాలు జిల్లాల నుండి రావలసి ఉన్నవని తెలిపారు. ఫిబ్రవరి తర్వాత అందిన అంచనాలను వచ్చే సంవత్సరానికి పరిగణలోకి తీసుకుంటామని కావున ఈ నెల 29 లోగా అంచనాలు మొత్తం పంపించాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ మొదటి విడత పనులన్నింటిని మార్చి 31 లోగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండవ విడతలో మంజూరైన పనులకు షార్ట్ టెండర్లు పిలిచి, టెండర్ల ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. టెండర్లు పూర్తి అయిన ఐదు రోజుల్లోగా పనులు ప్రారంభించాలని లేకుంటే అంతకన్న తక్కువ ధరకు టెండరు పాడిన రెండవ కాంట్రాక్టరుకు పనులను అప్పగించాలని సూచించారు. మిషన్ కాకతీయ రెండవ విడతలో పనులు జరుగు అన్ని చెరువులలో సాయిల్ టెస్టింగ్ వందశాతం చేయించాలని సూచించారు. అన్ని చెరువులలో చెరువుల పూర్తిస్ధాయి నీటిమట్టం వరకు డీమార్కింగ్ చేయించాలని సూచించారు. మిషన్ కాకతీయలో అటవి సమస్యలుంటే జిల్లా కలెక్టర్ల స్ధాయిలో పరిష్కరించాలని లేకుంటే రాష్ట్ర్ర స్ధాయిలో పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లాలకు మంజూరు చేసిన గోదాముల నిర్మాణానికి వారం రోజుల్లోగా స్ధలాలు కేటాయించాలని లేకుంటే వాటిని రద్దుచేసి స్ధలాలు ఇచ్చిన వేరే జిల్లాలకు మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట, సైదాపూర్, హుజురాబాద్ లకు మంజూరు చేసిన గోదాములకు స్ధలాలు కేటాయించాలని కోరారు. మైన్స్ ద్వారా రాష్ట్ర్రానికి 5 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అందుకు సంబంధించి జిల్లాలో తహసీల్దార్లు క్వారీలకు నో అబ్జెక్షన్స్ సర్టిఫికెట్స్ త్వరగా ఇచ్చేలా తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్లకు సూచించారు. మార్కెట్లలో ఉల్లిగడ్డలకు ధర చాలా తగ్గిందని రైతులకు కనీసం కిలోకు 6/- రూ.ల ధర రావడం లేదని దీనితో రైతులు చాలా నష్టపోతున్నారని అన్నారు. హైదరాబాదు రైతు బజారులో ఉల్లిగడ్డలకు కిలోకు 20/- రూ.ల ధర పలుకుతుందని తెలిపారు. మార్కెటింగ్, ఉద్యానవన, వ్యవసాయ ఉద్యోగులను మండలానికి ఒకరిద్దరిని కేటాయించి రైతులతో సమన్వయ పరుస్తూ ఆర్టీసితో మాట్లాడి హైదరాబాద్ రైతు బజారులో నేరుగా రైతులు అమ్ముకొనేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. అన్ని జిల్లాల నుండి వెంటనే జిల్లా ఇరిగేషన్ ప్లాన్ లను జిల్లా పరిషత్ ఆమోదంతో సమర్పించాలని కలెక్టర్లకు సూచించారు. ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయుటకు 123 జి.ఓ. ప్రకారం భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎజెసి డా.ఎ.నాగేంద్ర, సి.ఇ. అనీల్ కుమార్, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్.ఇ. గోవిందరావు, ఇరిగేషన్ ఎస్.ఇ. వెంకట కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

DSC_8127

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *