
కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను ఫిబ్రవరి మూడవ వారంలో ప్రారంభిస్తామని రాష్ట్ర్ర ఆర్ధిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. బుదవారం జమ్మికుంటలోని ఎం.పి.ఆర్ గార్డెన్సులో హుజురాబాద్ నియోజకవర్గ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గంలో ఇండ్లు లేని నిరుపేదల కుటుంబాల సర్వే చేయించామని, అట్టి జాబితాలు గ్రామాలకు పంపుతామని పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేసి వెంటనే తహసీల్దార్లకు పంపించాలని ఆదేశించారు. అన్ని గ్రామాలలో పనులు ప్రారంభింస్తామని అన్నారు. త్వరలో కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని అన్నారు. ఇండ్లకు అవసరమైన ఇసుక ఇప్పిస్తామని, సిమెంటు ఒక బస్తా 230/- రూపాయల చొప్పున సరఫరా చేస్తామని అన్నారు. అన్ని గ్రామాలకు స్మశాన వాటికలు మంజూరు చేస్తామని అన్నారు. హుజురాబాద్ నియోజక వర్గంలో 92 గ్రామపంచాయితీలకు 70 గ్రామ పంచాయితీలకు మంజూరు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరధ క్రింద అన్ని గ్రామాలలో త్రాగునీటి పైపులు వేస్తున్నారని, సి.సి. రోడ్లు వేయక ముందు పైపులైన్లు వేయాలని అన్నారు. ఈ సంవత్సరము అన్ని గ్రామాలకు ఎల్ఎమ్ డి నుండి త్రాగు నీరు అందిస్తామని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరి గోడలు, గేట్లు, అదనపు తరగతి గదులు, కిచన్ షెడ్లు, అన్నింటికి ఒకేసారి మంజూరు ఇస్తామని తెలిపారు. నియోజక వర్గానికి మంజూరు అయిన గురుకుల పాఠశాలల నిర్మాణానికి భూమిని గుర్తించాలని అన్నారు. ఉపాధి హమి పనులు గ్రామాలలో ఎక్కువగా చేయించాలని, గ్రామాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. గ్రామాలలో జరుగు అభివృద్ధి సంక్షేమ పధకాల అమలులో ప్రజా ప్రతినిధులు భాగస్వాములై పర్యవేక్షించాలని, నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని అన్నారు.
ఈ సమావేశంలో జె.సి. బి.శ్రీనివాస్, డిఆర్ఓ ఆయేషా మస్రత్ ఖానం, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.