
జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాల ముందు ప్రత్యేకంగా రెండు డస్ట్బిన్లను ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులను కమిషనర్ దానకిషోర్ ఆదేశించారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2019 పై ఖైరతాబాద్ ఆస్కిలో జీహెచ్ఎంసీ అధికారులకు ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించారు. అడిషనల్, జోనల్, డిప్యూటి కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ట్రాన్స్పోర్ట్ ఇంజనీర్లు, యు.సి.డి అధికారులు ఈ వర్క్‌షాప్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ దానకిషోర్ మాట్లాడుతూ ప్రతి దుకాణం ముందు తప్పనిసరిగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడానికి రెండు డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ సక్రమంగా అమలు కావడంలేదని, ఈ విషయంలో ప్రతిఒక్కరూ విధిగా ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. నగరంలో భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించేందుకు ఈ వారాంతంలోగా 200 టిప్పర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు 600 ట్రిప్పులు నిర్మాణ వ్యర్థాలను తొలగిస్తాయని పేర్కొన్నారు. బహిరంగ మలమూత్ర రహిత నగరంగా హైదరాబాద్‌ను మరోసారి గుర్తింపు పొందడానికి విస్తృత చర్యలు చేపట్టామని, దీనిలో భాగంగా సర్కిళ్లకు ఓ.డి.ఎఫ్ సర్కిళ్లను జీహెచ్ఎంసీ స్థాయిలో గుర్తింపును అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఉన్న 165 చెరువుల ప్రక్షాళన, శుద్దిని దశలవారిగా చేపడుతామని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో భాగంగా స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించనున్నట్టు పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్‌లో అడిషనల్ కమిషనర్ శృతిఓజా, రవికిరణ్, జోనల్ కమిషనర్లు హరిచందన, ముషారఫ్ అలీ, రఘుప్రసాద్, శంకరయ్య, శ్రీనివాస్‌రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.