
ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి 18ఏళ్లు నిండిన యువతీయువకులు విధిగా ఓటరు నమోదు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ పిలుపునిచ్చారు. నేడు ఓటరు నమోదు, సవరణలపై సికింద్రాబాద్ కస్తూర్భా మహిళా కళాశాలలో నేడు నిర్వహించిన చైతన్య కార్యక్రమానికి దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోనల్ కమిషనర్లు హరిచందన, రఘుప్రసాద్, కస్తూర్భా కళాశాల ప్రిన్సిపల్ అనితారెడ్డిలు హాజరైన ఈ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ దేశ జనాభాలో అత్యధిక శాతం యువత ఉన్న దేశం భారతదేశం అని అయితే 18ఏళ్లు నిండిన యువత ఓటరుగా నమోదు చేసుకోవడానికి నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. 2018 జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు తమ సోదరీసోదరులతో కూడా ఓటరు నమోదు చేయించాలని సూచించారు. ఓటర్ల నమోదుతో పాటు అభ్యంతరాలను ఈ నెల 25వ తేదీలోపు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. మన, మన దేశ ఉజ్వల భవిష్యత్‌కు ఓటు హక్కే ప్రధాన సాధనమని, ఓటు వేయడం వల్ల ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని అన్నారు. హైదరాబాద్ నగరంలో పురుషుల ఓటర్లను పోలిస్తే మహిళల ఓటర్ల నమోదు తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఓటుకు ఆడ, మగ బేధాలులేవని, అందరికీ సమాన హక్కు ఉందని అన్నారు. ఆన్‌లైన్‌తో పాటు మైజీహెచ్ఎంసీ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-2999 అనే నెంబర్‌కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కమిషనర్ సూచించారు. నగరవాసుల్లో ఉదాసీనత, నిర్లిప్తత అధికంగా ఉంటుందని, దీనివల్లే ఓటరుగా నమోదు కాకపోవడం, ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కాలంలో అత్యధిక ప్రభావంతంగా మారిన సామాజిక మాద్యమాలను ఓటరు చైతన్య కార్యక్రమాలకు ఉపయోగించాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఓటు నమోదు, ఓటు విలువపై ప్రణిత అనే అమ్మాయి పాడిన పాట పలువురిని ఆకట్టుకుంది.
*స్వచ్చతే సేవాలో పాల్గొన్న కమిషనర్ దానకిషోర్*
స్వచ్ఛ సర్వేక్షణ్-2019ను పురస్కరించుకొని కస్తూర్భా గాంధీ మహిళా కళాశాలలో నిర్వహించిన స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో కళాశాల విద్యార్థినీలచే కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ అనితారెడ్డి, జోనల్ కమిషనర్లు హరిచందన, రఘుప్రసాద్‌లు పెద్ద ఎత్తున ఎన్.సి.సి కార్యకర్తలు, విద్యార్థినీలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కమిషనర్ దానకిషోర్ కళాశాల ప్రాంగణంలో వ్యర్థాలను తొలగించారు. తమ కళాశాలలో ఐదు వర్షపునీటి ఇంకుడు గుంతలు, హరితహారం కింద పెద్ద సంఖ్యలో మొక్కలు నాటామని కళాశాల ప్రిన్సిపల్ అనితారెడ్డి కమిషనర్‌కు వివరించారు. ఈ కార్యక్రమంలో మేజర్ శివకిరణ్, డిప్యూటి కమిషనర్ శైలజతో పాటు పలువురు ఎన్.సి.సి కార్యకర్తలు పాల్గొన్నారు.