ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుపై అసెంబ్లీ లో జరిగిన చర్చలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు, నియంత్రణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాల ఏర్పాటు తెలంగాణలో జరిగింది

ఇంజనీరింగ్ విద్యను ప్రక్షాళన చేశాం

ఫీజు రియంబర్స్ మెంట్ కోసం ఏటా 2200 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నాం

11 యూనివర్శిటీలలో 1061 పోస్టులు భర్తీ చేస్తున్నాం

దేశంలో మూడు రాష్ట్రాల్లో తప్ప అన్ని రాష్ట్రాల్లో ప్రైవేట్ యూనివర్శిటీలున్నాయి

ప్రైవేట్ యూనివర్శిటీల ద్వారా తెలంగాణ విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి

బిజెపి నేతల ఆలోచనలు కేవలం గ్రేటర్ హైదరాబాద్ చుట్టే తిరుగుతున్నాయి

బిజెపి పాలిత రాష్ట్రాల్లోనే ప్రైవేట్ యూనివర్శిటీలు అధికంగా ఉన్నాయి.

బిజెపిది జాతీయంగా ఒక విధానం..రాష్ట్రంలో మరొక విధానం ఉంది

ద్వంద్వ నీతితో బిజెపి, టిడిపి, సిపిఎంలు రాజకీయం చేస్తున్నాయి

ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లుపై అసెంబ్లీలో చర్చలో ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు, నియంత్రణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ విద్యార్థులకు కూడా ప్రైవేట్ రంగంలో నాణ్యమైన విద్య అందించే ఉద్దేశ్యంతో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. బిల్లును మంగళవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి, బుధవారం బిల్లు ఉద్దేశ్యాలను, లక్ష్యాలను సభ్యులకు వివరించారు. అనంతరం సభ్యులు అక్భరుద్దీన్ ఓవైసీ, డాక్టర్ కె. లక్ష్మణ్, ఆర్. కృష్ణయ్య, సున్నం రాజయ్య, జలగం వెంకట్రావు బిల్లుపై సభలో చర్చించారు. సభ్యుల ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిస్తూ… ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటు ద్వారా తెలంగాణలో ప్రభుత్వ విద్య బలహీనం కాదని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణలో ప్రభుత్వ విద్యను పటిష్టం చేయడానికి ఈ మూడేళ్లలో 577 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణ రాకముందు కేవలం 298 గురుకులాలే ఉన్నాయని వివరించారు. విదేశాల్లో చదివే విద్యార్థులకు 10 లక్షల స్కాలర్ షిప్ సరిపోదని, దానిని 20 లక్షలకు పెంచారన్నారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేశామని తెలిపారు. గతంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కాలేజీలుంటే…వాటిని నియంత్రించామన్నారు. దీనివల్ల ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలనుకున్న విద్యార్థులే ఆయా కోర్సుల్లో చేరుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 14 నుంచి 15 లక్షల మందికి లబ్ది చేకూరేలా ఫీజు రియంబర్స్ మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికోసం ఏటా 2200 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వాలు యూనివర్శిటీలను ఇచ్చి వాటికి నిధులు, నియామకాలు చేయడం మరిచిపోయాయని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక యూనివర్శిటీల్లో మౌలిక వసతుల కల్పన కోసం 420 కోట్ల రూపాయలు ఇచ్చామని, 1061 అధ్యాపకుల పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరం నుంచి ఈ నూతన అధ్యాపకులు విధుల్లో ఉంటారన్నారు. బిజెపి సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ చెప్పినట్లు శాతవాహన, పాలమూరు, తెలంగాణ యూనివర్శిటీలలో ఖాళీలు లేవని, అసలు అక్కడ మంజూరు చేసిన పోస్టులే లేవన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాకే అక్కడ పోస్టులు మంజూరు చేసి, ఇప్పుడు భర్తీ చేస్తున్నామన్నారు. ప్రైవేట్యూ నివర్శిటీల బిల్లు ఏ రాష్ట్రాల్లో లేదు, కేవలం తెలంగాణలోనే తెస్తున్నట్లు బిజెపి, టీడీపీలు చెప్పడాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పు పట్టారు. దేశంలో 29 రాష్ట్రాలుంటే జమ్ము-కాశ్మీర్, గోవా, కేరళ రాష్ట్రాల్లోనే ప్రైవేట్ యూనివర్శిటీలు లేవన్నారు. గోవాలో ప్రైవేట్ యూనివర్శిటీల ఏర్పాటుకు స్థలం లేదని, కేరళ రాష్ట్రంలో నిర్ణయం తీసుకోలేదని, జమ్ము-కాశ్మీర్ లో ప్రత్యేక పరిస్థితులున్నందున అక్కడ ప్రైవేట్ యూనివర్శిటీలు లేవన్నారు. దేశంలో రాష్ట్ర యూనివర్శిటీలు – 381, డీమ్డ్ యూనివర్శిటీలు -131, కేంద్ర విశ్వవిద్యాలయాలు – 47, ప్రైవేట్ యూనివర్శిటీలు -282 ఉన్నాయన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో గత పదేళ్లుగా బిజెపి పాలన చేస్తోందని, అక్కడే ఎక్కువ ప్రైవేట్ యూనివర్శిటీలున్నాయన్నారు. బిజెపి నాయకులకు జాతీయ పార్టీగా ఒక విధానం, పక్క రాష్ట్రాల్లో మరొక విధానం, ఈ రాష్ట్రంలో ఇంకో విధానం ఉండడం మంచిది కాదన్నారు. ఇక్కడి బిజెపి నేతలు ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లు తీసుకురావడం వల్ల ఉస్మానియా విశ్వవిద్యాలయంపై ఎందుకంత కోపమని మాట్లాడుతుండడాన్ని తప్పు పట్టారు. ఇక్కడి బిజెపి నేతల ఆలోచనలు గ్రేటర్ హైదరాబాద్ ను దాటడం లేదని, మీది జాతీయ పార్టీ అని మరిచిపోతున్నారని గుర్తు చేశారు. ఇక టీడీపీ నేతలు పక్క రాష్ట్రంలో పాలిస్తూ ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లు 2016లోనే తెచ్చారని, తనకు తెలిసినంత వరకు 11 ప్రైవేట్ యూనివర్శిటీలు అక్కడ వస్తున్నాయని చెప్పారు. సిపిఎం పాలిస్తున్న త్రిపురలో కూడా ప్రైవేట్ యూనివర్శిటీలున్నాయన్నారు. కేవలం ద్వంద్వ నీతితో రాజకీయం చేస్తున్నాయని ఆ పార్టీలపై మండిపడ్డారు. ఈ పార్టీలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడడం లేదన్నారు. ప్రైవేట్ యూనివర్శిటీల బిల్లు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి, చర్చించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.