ప్రాజెక్టు పనులకు టైమ్ లైను ఖరారు చేసిన మంత్రి హరీశ్ రావు.

డిసెంబర్ కల్లా ఉదయసముద్రం పూర్తి.

ప్రతి శనివారం భూసేకరణ పై కలెక్టర్ సమీక్ష

అప్రోచ్ కెనాల్ నిర్మాణం పూర్తి.

చివరి దశలో టన్నెల్ నిర్మాణం.

అక్టోబర్ చివరికల్లా సబ్ స్టేషన్, పంపు హౌజ్ లు పూర్తి.

ప్రాజెక్టు పనులకు టైమ్ లైను ఖరారు చేసిన మంత్రి హరీశ్ రావు.

టైమ్ లైనులో పని చేయని ఏజెన్సీ ల తొలగింపు.
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత, కరువు పీడిత ప్రాంతాల తాగు, సాగునీటి కోసం ఉదయసముద్రం ప్రాజెక్టు ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్న ట్టు ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.నకిరేకల్, మునుగోడు, నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు, రైతులకు దీంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
ఎట్టి పరిస్తితులలోనూ ఈ ప్రాజెక్టు డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులును ఆయన ఆదేశించారు. జనవరిలో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ లోకి నీరు పడాలని హరీష్ రావు ఆదేశించారు.6.9 కిలోమీటర్ల ఆప్రోచ్ కెనాల్ పూర్తయిందని ,టన్నెల్ పనులు చివరి దశలో ఉన్నట్టు చెప్పారు.
శనివారం ఉదయం మంత్రి హరీశ్ రావు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,ఎం.పి.గుత్తా సుఖేందర్ రెడ్డి ,ఎం.ఎల్.ఏ వీరేశం, బండా నరేందర్ రెడ్డి లతో కలిసి ఉదయసముద్రం పనులను మెరుపు తనిఖీ చేశారు.92 మీటర్ల లోతున నిర్మిస్తున్న సర్జ్ పూల్ లోనికి వెళ్ళి స్వయంగా పనులను పరిశీలించారు. తరువాత బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ ను మంత్రి సందర్శించారు. ఉదయసముద్రం ప్రాజెక్టు సైటు దగ్గర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటకెక్కించిన ఈ ప్రాజెక్టును కేసీఆర్ మళ్ళీ పట్టాలపై ఎక్కించిన విషయాన్ని హరీశ్ రావు గుర్తు చేశారు.ప్రతి వారం సి.ఎం. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తాగునీటి, సాగునీటి పథకాల పురోగతిని సమీక్షిస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు.కీలకమైన ఉదయసముద్రం ప్రాజెక్టు పనులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులు, ఏజెన్సీ ని కోరారు. కాంగ్రెస్ హయాంలో పంపులు, మోటార్ల కొనుగోళ్ళు తప్ప సర్జ్ పూల్ నిర్మాణం, కాలువల తవ్వకాలు, సివిల్ పనులేవీ సాగలేదన్నారు.ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కు కావలసిన 220 కె.వి.సబ్ స్టేషన్ నిర్మాణం పనులు అక్టోబర్ చివరికి పూర్తి చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆ శాఖ అధికార యంత్రాంగాన్ని శనివారం ఆదేశించారు.33 విద్యుత్ టవర్ లలో పూర్తి కాకుండా మిగిలిపోయిన 1 టవర్ నిర్మాణ పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ కోరారు. స్పెషల్ డ్రైవ్ చేస్తేనే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. డిసెంబర్ లో డ్రై రన్ నిర్వహించవలసిందేనని,ఎలాంటి అలసత్వం సహించబోమని హరీష్ రావు హెచ్చరించారు.
ప్రాజెక్టు ను పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలని , 60 చెరువులను నింపాలని మంత్రి ఆదేశించారు.ఈ మేరకు ఆయా పనులకు ‘టైమ్ లైను’ విధించారు. టార్గెట్ ప్రకారం పనులు పూర్తి చేయడం లో విఫలమైతే సంబంధిత ఏజెన్సీని తొలగించి ప్రత్యామ్నాయంగా మరో ఏజెన్సీ కి పనులు కేటాయించాలని ఆదేశించారు. భూసేకరణ, పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. ఏ.ఎం.ఆర్.పి. లో లెవల్ కెనాల్ భూసేకరణ కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను కోరినట్లు మంత్రి తెలియజేశారు.దాదాపు ఎనిమిదేళ్లుగా కోర్టులలో నలుగుతున్న9 ఎకరాల భూసేకరణ కేసును త్వరిత గతిన కొలిక్కి తీసుకు రావాలని అన్నారు. ప్రస్తుతం ఎల్.ఎల్.సి నుంచి 37 వేల ఎకరాలకు సాగు నీరందజేస్తున్నందున ఈ కేసు పరిష్కారమైతే మొత్తం 50 వేల ఎకరాలకు ఎల్.ఎల్.సి ద్వారా ఆయకట్టు జరుగుతుందని మంత్రి అన్నారు. పెండింగులో ఉన్న భూసేకరణకు గానూ సంబంధిత ఏజెన్సీ ప్రతినిధులు, ఇరిగేషన్ ఇంజినీర్లతో ప్రతి శనివారం సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గౌరవ ఉప్పల్ ను కోరారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయడానికి రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టుల భూసేకరణ, డిజైన్లు,తదితర పనులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని చీఫ్ ఇంజనీరు ఎస్.సునీల్ ను ఆదేశించారు.
మంత్రి జగదీశ్ రెడ్డి, ఎం.పి.గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎం.ఎల్.ఏ.వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సి.ఈ. ఎస్.సునీల్,ఏజెన్సీ ల ప్రతినిధులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *