
కరీంనగర్: జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించుటకు రైతులు సహకరించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. శుక్రువారం కలెక్టరేటు సమావేశ మందిరంలో భూ సేకరణ పై ఇల్లంతకుంట మండలంలోని వివిధ గ్రామాల ప్రజలతో ధర నిర్ణయం పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇల్లంతకుంట మండలంలోని 8 గ్రామాలలో 2454 ఎకరాల భూసేకరణ చేయవలసియున్నదని తెలిపారు. ప్రభుత్వం ప్రాజెక్టుల భూ సేకరణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించిందని, అందుకు ప్రజల సహకారం అవసరమని అన్నారు. గత మూడు సంవత్సరా లరిజిస్ట్ర్రేషన్ డ్యాకుమెంట్ల రేట్ల ప్రకారం భూములకు ధరలు నిర్ణయిస్తామని తెలిపారు. కొత్త యాక్ట్ ప్రకారం ఎకరాకు ప్యాకేజి కింద ధర నిర్ణయిస్తామని అది అందరికీ వర్తిస్తుందని తెలిపారు. భూమి కోల్పోతున్న రైతుల ఆవేదన దృష్టిలో పెట్టుకొని బావులు, బోర్లు ఉన్న భూమికి ఎకరాకు 6.50 లక్షలు, లేని భూములకు 5.50 లక్షలుగా ధర నిర్ణయించామని అందుకు అంగీకరించాలని కోరారు. రాష్ట్ర్ర సాంస్కృతిక సారధి, మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ మాట్లాడుతూ, రైతులు భూమి పై ఆధారపడి బతుకుతారని, భూమి వెలకట్టలేనిదని అన్నారు. ప్రభుత్వము చేపట్టిన ప్రాజెక్టులకు భూమి సేకరించకతప్పదని అన్నారు. ఒక గ్రామం ముంపుకు గురిఅయితే 1000 గ్రామాల
ప్రజలు బాగుపడతారని అన్నారు. భూములకు ప్యాకేజి తీసుకుంటే అందరూ లాభపడుతారని అందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమిబసు, స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిరిసిల్ల, కరీంనగర్ ఆర్టీఓలు బిక్షానాయక్, చంద్రశేఖర్, స్పెషల్ డిప్యూటి కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.