
కరీంనగర్: ప్రాజెక్టుల నిర్మాణానికి చేపడుతున్న భూ సేకరణకు సహకరించి అభివృద్ధికి తోడ్పడాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్ అన్నారు. బుధవారం కలెక్టరేటు సమావేశ మందిరంలో గౌరవెల్లి, గండిపెల్లి ముంపు గ్రామాల ప్రజలతో భూ ధరపై హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితెల సతీష్ కుమార్ తో కలిసి సంధి చర్చల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలకు లోబడి వీలయినంత ఎక్కువ పరిహరం ఇస్తామని, మార్కెట్ ధరతో చెల్లించుటకు వీలుకాదని అన్నారు. ఈ సందర్బంగా భూములకు ఎకరాకు రూ. 5.25 లక్షలు, బోర్లు, నిర్మాణాలు వున్న భూములకు ఎకరాకు రూ. 6.25 లక్షలు తుది ధరగా నిర్ణయించారు. ఈ ధరకు అంగీకరించి సహకరించాలని వీలయినంత త్వరలో పరిహరం అందజేస్తామని, అంగీకరించని పక్షంలో భూ సేకరణ చట్టంతో ముందుకు వెళతామన్నారు. సమావేశంలో పాల్గొన్న హుస్నాబాద్ శాసన సభ్యులు వొడితెల సతీష్ కుమార్ మాట్లాడుతూ, భూములు కోల్పోతున్న వారి బాధలు అర్ధం చేసుకోగలనని ప్రభుత్వం ద్వారా వీలయినంత ఎక్కువ మొత్తం త్వరలో పొందడానికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు. అనంతరం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి క్రింద రామడుగు మండలంలోని దత్తాజిపేట, చిప్పగుర్తి గ్రామాలకు 7.50 లక్షలు ప్రతి ఎకరాకు నిర్ణయించారు. రామడుగు మండల కేంద్రంలోని భూములకు రూ.8.25 లక్షలు నిర్ణయించారు. శంకరపట్నంలో కరీం పేట తదితర గ్రామాలకు 6.6 లక్షలు నిర్ణయించారు. దీనితో పాటుగా భూమిపై భవనాలకు, బావులు, పైపులు, చెట్టకు అదనంగా ధర నిర్ణయించి చెల్లిస్తామని తెలిపారు. సంబంధిత గ్రామాల ప్రజలు ఇరిగేషన్ శాఖ పనులకు సహకరించాలని అన్నారు. ఒక నెల లోపల పరిహరం అందే విధంగా చూస్తానని వారికి హమి ఇచ్చారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, ట్త్ర్రెనీ కలెక్టర్ గౌతం, భూ సేకరణ ప్రత్యేక కలెక్టర్ వెంకటేశ్వర్లు, కరీంనగర్ ఆర్టీవో చంద్రశేఖర్, ప్రత్యేక డిప్యూటి కలెక్టర్లు, అధికారులు, ముంపు గ్రామాల ప్రజలు తదితరలు పాల్గొన్నారు.