Breaking News

ప్రాజెక్టులు త్వరగా పూర్తిచేద్దాం

fadnavees-960x630

ముంబై, ప్రతినిధి : తెలంగాణ , మహారాష్ట్ర మధ్య నిర్మించ తలపెట్టిన అంతరాష్ట్ర నీటి పారుదల ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని తెలంగాణ, మహరాష్ట్ర ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌ రావు, దేవేంద్ర ఫడ్నవీస్‌ నిర్ణయించుకున్నారు. ముంబాయిలోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రులు ఇద్దరూ మంగళవారం సమావేశమయ్యారు. మంత్రులు టి.హరీష్‌రావు, జోగురామన్న, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, వేణుగోపాలాచారి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఎంపీలు బి. వినోద్‌కుమార్‌, బివి.పాటిల్‌, నీటి పారుదల శాఖ కార్యదర్శి ఎస్‌కె.జోషి, ఇఎన్‌సి మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

లెండి ప్రాజెక్టుకు సంబంధించి 2003 లోనే కుదిరిన అవగాహన మేరకు పనిచేసుకుని ఆరు టిఎంసిలకు పైగా గోదావరి జలాలను రెండు రాష్ట్రాల రైతులకు మళ్లించాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారు. మహరాష్ట్రలో 12 గ్రామాలు ముంపుకు గురవుతుండగా అందులో 11 గ్రామాల్లో భూసేకరణ పూర్తయ్యిందని, 6 గ్రామాల్లో నష్ట పరిహారం కూడా చెల్లించామని అధికారులు చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి త్వరితగతిన తాము చేయాల్సిన పనులు చేస్తామని హామి ఇచ్చారు. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం డబ్బులు చెల్లించాలనే డిమాండ్‌ను కూడా తాము ఒప్పుకుంటున్నామని, ఇప్పటికే రూ. 500 కోట్లను కూడా వెచ్చించామని ముఖ్యమంత్రి వెల్లడించారు.

లోయర్‌ పెన్‌గంగ ప్రాజెక్టును కూడా పూర్తి చేయాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు. రెండు రాష్ట్రాలకు ఎంతో ఉపయోగమైన ఈ ప్రాజెక్టు వల్ల కొంత అటవీ భూమి ముంపుకు గురవుతుందని, నష్టపరిహారంగా మరోచోట భూమి ఇవ్వాలని కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. రాజాపేట, రుభా, పిపర్డ్‌ల వద్ద బ్యారేజ్‌లు కట్టాడానికి అంగీకారానికి వచ్చారు.
ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడానికి సిద్దంగా ఉన్నందున మహరాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కేసిఆర్‌ కోరారు. దీనికి మహరాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. గోదావరి నదిలోని 160 టిఎంసిల నీటిని తెలంగాణ వాడుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహరాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఆ తరువాత ముఖ్యమంత్రులిద్దరు రాజ్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రక్క ప్రక్క రాష్ట్రాలైన తెలంగాణ-మహరాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తాయని మహరాష్ట్ర సిఎం చెప్పారు. మూడు ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికిప్పుడు చర్చలు జరుపుతామని, పరస్పరం సంప్రదించుకుంటూ ముందుకు పోతామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మాట్లాడుతూ కొత్తగాఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్నో ఆకంక్షలు , అవసరాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా ఇరుగుపొరుగు రాష్ట్రాలతో సంబంధాలు మెరుగుపరచుకుంటామని, నదీ జలాలను సమర్దవంతంగా వినియోగించుకుంటామని ప్రకటించారు. అంతరాష్ట్ర ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసే విషయంలో సానుకూలంగా స్పందించిన మహరాష్ట్ర ముఖ్యమంత్రి పడ్నవిస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

పుట్టిన రోజు నాడు సంబరాలకు పరిమితం కాకుండా తెలంగాణ ప్రజలకోసం కేసిఆర్‌ ముంబాయి దాకా వచ్చారని ఫడ్నవిస్‌ అభినందించారు. మహా శివరాత్రి పండగనాడు కూడా రెండు రాష్ట్రాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడం కోసం సమయం కేటాయించినందుకు ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *