
అన్యాయానిదే అధికారమైతే.. ప్రశ్నించే గొంతుదే ‘గొడవ’.. ఆధిపత్యానిదే నిర్బంధమైతే ఎదురించే కలానిదే తిరుగుబాటు.. ధిక్కారమే ఉద్యమం అయినప్పుడు.. ప్రతిధ్వనించే నినాదమే కాళోజీ.. ఫిరంగి లాంటి మాటలు.. నిప్పు కనికల్లాంటి కవిత్వాలతో కాలాతీతం చేసిన అక్షర నది కాళన్న. నా యాస, నా నేల , నా జాతి , నా సంస్కృతి.. అనే ‘అహంభావం’ గల అసలైన కవి. ప్రజాసమస్యలపై పోరాడిన అలుపెరగని కలం యోధుడు.. ఏడున్నర దశాబ్దాలు ప్రజల పక్షాన గొంతెత్తిన ప్రజాకవి. తుది శ్వాస వరకు జనం కోసమే ఉద్యమించిన కవి సింహం.. స్వరాష్ట్ర కోసం గళమెత్తిన పక్కా తెలంగాణ వాది.. ‘బడి పలుకుల భాష కాదు.. పలుకుబడుల భాష కావాలె’ అని తన భాషసోయిని ప్రపంచానికి చాటిన వ్యవహార దక్షుడు.. కాళోజీ జన్మదినమైన సెప్టెంబర్ 9ని ప్రభుత్వం తెలంగాన భాష దినోత్సవంగా గుర్తించింది. బుధవారం కాళోజీ జయంతి.. ఆ ప్రజాకవి యాదిలో తెలంగాణ తరఫున ఘనంగా నివాళులర్పిద్దాం..