
-కరీంనగర్ టీడీపీ కార్యకర్తల సభలో చంద్రబాబు
కరీంనగర్, ప్రతినిధి : ‘ప్రభుత్వ పరంగా సహకరించుకుందాం.. పార్టీ పరంగా ఎవరి దారి వారిది’ అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళవారం కరీంనగర్ లో జరిగిన తెలంగాణ టీడీపీ ప్రతినిధులు, కార్యకర్తల సభలో పాల్గొన్న చంద్రబాబు రాజకీయాలపై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం కోరితే కరెంటు విషయంలో సహకరిస్తామని అన్నారు. ముందుచూపుతోనే కరెంటు కొనుగోలు చేశామని వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కలిసి కూర్చొని పరిష్కరించుకుందామని చెప్పారు. తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు బాగుండాలని వాటి అభివృద్ధి కోసం చివరి రక్తపు బొట్టువరకు కృషి చేస్తానని చెప్పారు.
హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది తామేనని.. అందుకే తెలంగాణకు ఇప్పుడు మిగులు బడ్జెట్ ఉందని చెప్పారు. టీడీపీని విమర్శించే హక్కు టీఆర్ఎస్ కు లేదని అన్నారు. కొంతమంది టీడీపీకి ద్రోహం చేసి పదవుల కోసం టీఆర్ఎస్ కు అమ్ముడుపోయారని చంద్రబాబు విమర్శించారు. కృష్ణపట్నం విద్యుత్ పై కూడా కూర్చొని మాట్లాడుకుందామని గవర్నర్ సమక్షంలో సమస్యలు పరిష్కరించుకుందామని చెప్పారు.
మాదిగలకు రాజకీయంగా గుర్తింపునిచ్చింది టీడీపీయే నని ఇక్కడ టీడీపీ సభలను అడ్డుకోవడం సరైందికాదని ఎమ్మార్పీఎస్ ను కోరారు. ఈ కార్యక్రమంలో కొందరు ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ కార్యకర్తలు, విద్యార్థులు చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని బయటకు వెళ్లగొట్టారు.
కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి, విజయరమణరావు, మోత్కపల్లి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.