
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2017 డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలను హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న సందర్భంగా మంగళవారం ఉదయం రవీంధ్రభారతిలోని కళాభవన్ లో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి ఆద్వర్యంలో ప్రముఖ సాహితి వేత్తలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాహితీ పరంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలు, ప్రచురించాల్సిన ప్రచురణలు, సాహిత్య ప్రక్రియల పై ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రముఖ సాహితీ వేత్తలు పలు సూచనలు, సలహాలు వ్యక్తం చేశారు.
మహాసభల నిర్వహణ కోసం రచయితలు, సాహిత్య ప్రముఖులతో ఒక సమావేశం నిర్వహించి సలహాలు ఆహ్వానించటం ముదావహమని అందరూ అభిప్రాయ పడ్డారు.
ప్రాచీన పద్య కావ్యాలను, నాటకాలను ప్రచురించి తక్కువ ధరకు సాహితీ ప్రియులకు అందుబాటులో ఉంచాలని కోరారు. తెలుగు మహాసభల ప్రాంగణంలో ప్రధాన ద్వారాలకు తెలంగాణకు విశిష్ట సేవలందించిన ప్రముఖుల పేర్లు పెట్టాలని సూచించారు. వివిధ అస్తిత్వ సమూహాలను దృష్టిలో ఉంచుకొని చర్చా గోష్టులు సదస్సులు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. అన్నీ వేదికల మీద జరిగే పలు సభల్లో తెలంగాణ ముద్ర ఉండే విధంగా రూపొందించాలన్నారు. చిత్ర కళాప్రదర్శన, చాయా చిత్ర ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, వాద్య పరికరాల ప్రదర్శన ప్రాంగణంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. మహాసభలు దిగ్విజయంగా కొనసాగటానికి అందరూ భాగం పంచుకుంటామన్నారు.
ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ పై జరిగిన ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులైన ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి.రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులు డా. నందిని సిధారెడ్డి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి దేశపతి శ్రీనివాస్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు డా. అయాచితం శ్రీధర్, తెలుగు విశ్వ విద్యాలయం ఉపకులపతి డా. ఎస్.వి.సత్యనారాయణ మరియు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ పాల్గొనారు.
ఈ సమావేశంలో ప్రముఖ రచయితలు కొలకలూరి ఇనాక్, బేతవోలు రామబ్రహ్మం, కె.శివారెడ్డి, దేవి ప్రియ, డా. శ్రీరంగా చారి, బి. సి. కమిషన్ ఛైర్మన్ BS రాములు, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, జూలూరి గౌరి శంకర్, సుద్ధల అశోక్ తేజ, కోవెల సుప్రసన్నాచార్యులు, తిరుమల శ్రీనివాస చార్యులు, అనుమాండ్ల భూమయ్య, మసన చెన్నప్ప, డా. అమ్మంగి వేణుగోపాల్, డా. నాళేశ్వరం శంకరం, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, రామాచార్యులు, సుధామ, ఏనుగు నరసింహారెడ్డి, రవ్వా శ్రీహరి, సంగన భట్ల నర్సయ్య, ముదిగంటి సుజాత రెడ్డి, ఓల్గా, సూర్యా ధనుంజయ, జూపాక సుభద్ర, షాజహానా, మృణాళిని, తిరునగరి దేవకీ దేవి, జ్వలిత, కందుకూరి శ్రీరాములు, పెద్దింటి అశోక్ కుమార్, వెలపాటి రామారెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, గిరిజా మనోహర్ బాబు, గార్లతోపాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు.