Breaking News

ప్రత్యూషకు కేసీఆర్ సాదర స్వాగతం

02kcr pratyusha

కన్న తండ్రి, సవతి తల్లి పెట్టిన చిత్రహింసలకు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో కోలుకున్న ప్రత్యూష బుధవారం మద్యాహ్నం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చింది. ఇటీవల గ్లోబల్ ఆసుపత్రిలో ప్రత్యూషను పరామర్శించిన సందర్భంగా, కోలుకున్న తర్వాత తన ఇంటికి రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆహ్వానించారు. బుధవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత హైకోర్టులో హాజరుపరిచిన అధికారులు, అక్కడి నుంచి నేరుగా సిఎం ఇంటికి తీసుకొచ్చారు. సిఎం కేసీఆర్, ఆయన భార్య శోభ ఆమెను సాదరంగా ఆహ్వానించారు.యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తనతో పాటు కూర్చోబెట్టుకుని కలిసి భోజనం చేశారు. ప్రత్యూష చదువు బాధ్యతంతా ప్రభుత్వమే భరించాలని, దానికి తగిన ఏర్పాటు చేయాలని డిప్యూటి సిఎం కడియం శ్రీహరిని సిఎం ఆదేశించారు. ఆమె చదువు, వసతి, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు తెలుసుకుని అండగా వుండాలని కలెక్టర్ రఘునందన్ రావు, సైబరాబాద్ సిపి సి.వి.ఆనంద్ లను ఆదేశించారు.

03kcr

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. బ్యాంకులో అకౌంట్ తీసి ఈ డబ్బులు జమ చేయాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ జరిగిందేదో జరిగింది. ఇక నుంచి సపోర్ట్ దొరికింది. దీనిని ఉపయోగించుకోవాలి. బాగా చదవాలి. పైకి రావాలి. నువ్వు కష్టపడి చదివి పైకి రావడమే.. నిన్ను బాధ పెట్టిన వారికి నువ్వు వేసే శిక్ష. ఇకపై నీ తెరువుకెవరూ రారు. ధైర్యంగా వుండు. అన్నిటికి నేనున్నాను. ఎప్పుడైనా నా ఇంటికి నువ్వు రావచ్చు, పోవచ్చు’’ అని చెప్పారు. తన ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. అనంతరం ప్రత్యూషను అధికారులు హాస్టల్ తీసుకెళ్లారు. హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికారి ప్రతినిధి వేణుగోపాలచారి కూడా ముఖ్యమంత్రి వెంట వున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *