ప్రతీ ఒక్కరికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం గొప్పది:మెగ్వెల్

ప్రతీ ఒక్కరికి సురక్షితమైన తాగునీటిని అందించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం గొప్పదన్నారు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి మెగ్వెల్. ప్రజలకు మేలు చేసే ఏ విషయంలోనైనా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ప్రపంచ బ్యాంక్ సిద్దంగా ఉందన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ లోని RWS&S కార్యాలయంలో ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో “తాగునీటి పథకాల నిర్వహణ-అభిప్రాయ సేకరణ” వర్క్ షాప్ జరిగింది. పాత ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాల్లో ప్రపంచ బ్యాంక్ నిధులతో నిర్మించిన తాగునీటి పథకాల (SVS-MVS) స్టేక్ హాల్టర్స్ (సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ప్రజలు ) ఈ కార్యక్రమానికి వచ్చారు.వర్క్ షాప్ ను ప్రారంభించిన ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డి, అసలు తాగునీటి సౌకర్యం లేని పాత ఆదిలాబాద్,కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలోని 980 ఆవాసాలకు మంచినీటిని అందించేందుకు 2009లో ఈ పథకాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. 2014లో పూర్తి కావాల్సిన ఈ పథకాల పనులు అనివార్య కారణాలతో కాలేదన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ పనులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పూర్తి చేశామన్నారు. ప్రతీ ఇంటికి నల్లాతో నీటిని అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయానికి ప్రస్తుతం ఆయా జిల్లాలోని10 లక్షల 72 వేల జనాభాకు నీళ్లు అందుతున్నాయన్నారు. ఈ సందర్భంగా ఆ తాగునీటి పథకాలతో ప్రయోజనం పొందుతున్న ప్రజల అభిప్రాయాలను ఈ.ఎన్.సి వివరించారు. ఆ తర్వాత మిషన్ భగీరథ ప్రాజెక్టుపై పవర్ పాయింట్, వీడియో ప్రజేంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత మాట్లాడిన ప్రపంచబ్యాంక్ TTL (TASK TEAM LEADER)మెగ్వెల్, సురక్షిత మంచినీటికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తమను ఆకట్టుకుందన్నారు. నిన్న (బుధవారం) సిరిసిల్ల, పెద్దపల్లి లోని తాగునీటి పథకాలను పరిశీలించామని పనులు బాగా చేశారని మెచ్చుకున్నారు. ఈ పథకాలతో ప్రయోజనం పొందుతున్న గ్రామస్థులతో మాట్లాడాక తమకు సంతృప్తి కలిగిందన్నారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం,ఇంజనీర్లు శాయశక్తులా కృషి చేశారన్నారు. ఇకముందు కూడా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. ఆ తర్వాత మాట్లాడిన ప్రపంచబ్యాంక్ TTL (TASK TEAM LEADER) రాఘవ, పథకం నిర్వహణలో చిన్న చిన్న సమస్యలు వస్తాయని, వాటిని పరిష్కరించే విషయంలో తమ సహకారం ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందన్నారు. ఈ పథకం పనుల విషయంలో పంచాయితీరాజ్ అధికారులు, సిబ్బంది బాగా సహకరించారని చెప్పారు. మిషన్ భగీరథతో ఈ పథకాలను అనుసంధానించడంతో ఇంకా సమర్థవంతంగా ప్రజలకు ఉపయోగపడతాయన్న నమ్మకం తమకుందన్నారు. ఈ వర్క్ షాప్ కు వచ్చిన కరీంనగర్ జెడ్పీ ఛైర్ పర్సన్ తుల ఉమ, పాత కరీంనగర్ జిల్లాలో చేపట్టిన ఈ పథకంతో గరిష్ట ప్రయోజనాలు కలుగుతాయన్నారు. ఈ వర్క్ షాప్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ రాములునాయక్, చీఫ్ ఇంజనీర్ విజయపాల్ రెడ్డి, ఆయా జిల్లాల ఎస్.ఈ, ఈఈలతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
వర్క్ షాప్ తర్వాత ప్రపంచబ్యాంకు ప్రతినిధులు చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్ ను కలిశారు. నిన్న ఫీల్డ్ విజిట్ అనుభవాలతో పాటు వర్క్ షాప్ వివరాలను చీఫ్ సెక్రటరీకి తెలియచేశారు. ప్రపంచ బ్యాంకు తరపున తెలంగాణ కు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పారు. తెలంగాణ తాగునీటి పథకాలకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం చేసినందుకు ఎస్పీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *