ప్రతి నియోజక వర్గ కేంద్రంలో సమగ్ర రైతుబజార్

కరీంనగర్: రాష్ట్ర్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో అధునాతన, సమగ్రమైన రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర్ర మార్కెటింగ్ గిడ్డంగులు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణా రాష్ట్ర్రంలోనే అధునాతన సౌకర్యాలతో కూడిన రైతు బజార్ ను మంత్రి హరీష్ రావు, ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెులంగాణా ప్రభుత్వం రైతులు స్వయంగా పండించుకుని తెచ్చే కూరగాయల ఉత్పత్తితోపాటు మార్కెటింగ్, రవాణా
సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లుచేస్తుందన్నారు. తెలంగాణాలోనే అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన రైతు బజార్ అది కూడా కూరగాయలతో పాటు నాన్ వెజ్ లభించే విధంగా సమగ్ర రైతుబజార్ కరీంనగర్ మొట్టమొదటిదన్నారు. జిల్లాలోని రామగుండం, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో కూడా త్వరలోనే రైతు బజార్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు అదనంగా రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు తాను సిద్దమని, ఇందుకు సంబందించిన ప్రతిపాదనలను పురపాలకశాఖ
అధికారులతో సమన్వయ పరుచుకుని స్ధలం నిర్ధారించుకుని పంపిస్తే వెంటనే మంజూరు చేస్తానన్నారు. అలాగే రైతులు ఆదరాబాదరాగా కూరగాయలను, మటన్, చికెన్, చేపలను అమ్ముకుని వెల్లకుండా ఉండేందుకుగాను నిల్వ చేసుకొనే విధంగా కోల్డ్ స్టోరేజి మంజూరు చేస్తున్నట్లు మంత్రి హరీష్ రావు ప్రకటించారు. ప్రభుత్వం ఎంత మంచి ఉద్దేశ్యంతోనైతే సౌకర్యాలను కల్పిస్తుందో అంతకు రెట్టింపు ఉత్సాహంతో అటు రైతులు, ఇటు మున్సిపల్ అధికారులు రోడ్లపై అమ్ముకునే విధానాన్ని కొనసాగకుండా చూడాలన్నారు. ఏ ఒక్కరు రోడ్డుపై అమ్మినా కూడా
రైతుబజార్ ల ఉద్దేశ్యం దెబ్బతినడమే కాక లోపల వ్యాపారం చేసుకునేవారికి నష్టం కలుగుతుందన్నారు. దీనిని నివారించే విషయంలో మాత్రం పురపాలకశాఖ నిక్కచ్చిగా వ్యవహరించాలని కోరారు. కరీంనగర్ మార్కెట్ కు బెంగుళూర్ నుంచి టమాటా, హర్యానానుంచి ఆలుగడ్డ, పంజాబ్ నుంచి క్యాబేజీ తరలి రావడం చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. కరీంనగర్ మండలంలోని రైతులతోపాటు జిల్లాలోని రైతులను వారే స్వయంగా కూరగాయల ఉత్పత్తి చేసేలా ప్రోత్సహించాలని, గ్రామాలనుంచి ఉదయమే ఆర్టీసి బస్సులను నడిచేలా చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. రైతులకు అవసరమైన విత్తనాలను ఉద్యానవనశాఖనుంచి సబ్సీడిపై పంపిణీ చేయించాలని కలెక్టర్ ను ఆదేశించారు. దీనివల్ల వినియోగదారులకు కూడా నాణ్యమైన కూరగాయలే కాకుండా తక్కువ ధరకు లభిస్తాయన్నారు. అలాగే రైతులకు గ్రీన్ హౌస్ లను మంజూరు చేయాలని, స్పిృంక్లర్, డ్రిప్ పరికరాలను సబ్సీడిపై పంపిణీ చేయాలని మంత్రి కలెక్టర్ ను ఆదేశించారు. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా హజరైన ఆర్ధిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రాన్ని తెలంగాణాలోనే అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనన్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లయినా మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. నగరాభివృద్ధికి ఇప్పటికే 100కోట్ల రూపాయలను స్ధానిక ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి మంజూరు చేయడం జరిగిందని, ఇంకా అవసరమైతే ఇచ్చేందుకు కూడా సిద్దంగా ఉన్నారన్నారు. తెలంగాణ ఆవిర్భావంలో కీలక భూమిక పోషించిన కరీంనగర్ పట్టణం అంటే ముఖ్యమంత్రికి ఎనలేని అభిమానం ఉందన్నారు. నగరం చుట్టూ ఉన్న కొండగట్టు, వేములవాడ, ధర్మపురి, కాళేశ్వరం దేవస్ధానాలకు వెల్లేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు అశేషంగా వచ్చే అవకాశం ఉన్నందున నగరంలో 350 కోట్లలో బృందావనాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం నిధులు ఇప్పటికే విడుదల చేయడం జరిగిందన్నారు. నగరిలోకి వచ్చేందుకు సస్పెన్షన్ బ్రిడ్జిని 78 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకుగాను ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. నగరం రూపు రేఖలను వచ్చే ఎన్నికల నాటికి సమూలంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పుడున్న నిధులే కాకుండా మరెన్ని అవసరం ఉన్నా కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. కూరగాయల రైతులు, మటన్, చికెన్ వ్యాపారులు, చేపలు అమ్ముకునేవారు రోడ్ల ప్రక్కన అపరిశుభ్రవాతావరణంలో అమ్మకాలు చేయకూడదనే ఉద్ధేశ్యంతోనే రైతుబజార్లలోనే సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనివల్ల ప్రజలకే కాకుండా అమ్ముకునేవారికి కూడా ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయన్నారు. తెలంగాణా వస్తే ఏమి లాభం జరుగుతుందో చేసి చూపిస్తున్నామని, తొలి సంవత్సరం చూడడానికి, అవగాహన కల్పించుకున్నామని, రెండో సంవత్సరంనుంచి అభివృద్ధి చర్యలు చేపట్టి చూపిస్తున్నామన్నారు. ఇల్లు అలకగానే పండుగకాదని, ఇంకా సమయం పడుతుందని రానున్న ఎన్నికలనాటికి గత 57 ఏళ్ళ పాలనకు భిన్నమైన అభివృద్ధిని చేసి చూపిస్తామని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. నగరంలోని రైతు బజార్ కు అవసరమైన మరో 5కోట్లను విడుదల చేసేందుకు తాను పిద్దంగా ఉన్నానన్నారు. కచ్చాదందాగా ఉన్న కూరగాయలు, మటన్, చికెన్, చేపల అమ్మకాలు అచ్చాదందాగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన స్ధానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ రైతులకు గతంలో ప్రకటించిన విధంగా 5రూపాయలకు భోజనం సౌకర్యాన్ని రైతు బజార్ లో కల్పించాలని, కోల్డ్ స్టోరేజి, విశ్రాంతి భవనం, క్యాంటిన్ లను ఏర్పాటు చేయడంతో పాటు రైతుబజార్ చుట్టూగల కనెక్టివిటీ రోడ్లకు నిధులు మంజూరు చేయాలని మంత్రి హరీష్ రావును కోరారు. నగర్ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మాట్లాడుతూ కార్పోరేషన్ ఇప్పటికి ఐదు రైతు బజార్లను నగరంలోని నాలుగు వైపులా కావాలని ప్రతిపాదనలు పంపించిందని దీనిని మంజూరు చేయాలన్నారు. అవసరమైతే వీటి నిర్వహణను కార్పోరేషన్ చూస్తుందన్నారు. 50వేల జనాభాకు ఒక రైతు బజార్ ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వ ఉద్ధేశ్యంగా ఉన్నందున నగరానికి 8 మార్కెట్లను మంజూరు చేయాలన్నారు. సిసి రోడ్లు, అప్రోచ్ రోడ్ల అభివృద్ధికి రెండుకోట్లను మంజూరు చేయాలని, సులబ్ కాంప్లెక్స్ లు మంజూరు చేయాలని మేయర్ మంత్రి హరీష్ రావును కోరారు. కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ నీతూప్రసాద్ మాట్లాడుతూ ఆధునిక సౌకర్యాలతో రైతు బజార్ ఏర్పాటు చేసినందున ఏ ఒక్కరు కూడా రోడ్లపై కూరగాయలు అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిరైతుకు కూడా రైతుబజార్ లో అమ్ముకునేందుకు సౌకర్యం కల్పిస్తామని, అందుకు ప్రతి ఒక్క రైతు కూడా తన రేషన్ కార్డు, ఆదార్ కార్డులను మెప్మా కార్యాలయంలో అందించాలన్నారు. ప్రతి రైతుకు కూడా గుర్తింపు కార్డు జారీచేస్తామన్నారు. వీటిని పక్కగా రికార్డులు తయారు చేసి రైతుల బాగోగులను ప్రభుత్వం చూస్తుందన్నారు. 350మంది రైతులుండగా సగం మంది కూడా వారివారి పత్రాలు సమర్పించలేదని వెంటనే అందిస్తే సౌకర్యం కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో బాగంగా మంత్రులు నాలుగున్నర కోట్లతో నిర్మించిన రైతుబజార్ షెడ్లను, చేపలు, మటన్, చికెన్ మార్కెట్ల భవనాలను ప్రారంభించారు. మార్కెట్ లో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతను మంత్రులు తవ్వి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, చొప్పదండి శాసనసభ్యురాలు బొడిగె శోభ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, ప్రాధమిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజమల్లయ్య, నగర డిప్యూటి మేయర్ గుగ్గిళ్లపు రమేష్, జాయింట్ కలెక్టర్ పౌసమి బసు, కమీషనర్ కృష్ణ భాస్కర్ తో పాటు కార్పోరేటర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

raitu bazar..     raithu bazar.     raitu bazar

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *