Breaking News

ప్రతి ఇంట సంక్రాంతి సంబరం..

sankranthi-2

-అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు
హైదరాబాద్, ప్రతినిధి : తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మిన్నంటాయి.. నిన్నటి భోగి మంటల నుంచి పండగ సందడి మొదలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్ మెదక్ జిల్లా ఎరవెల్లి లోని తన ఫామ్ హౌస్ లో కుటుంబంతో సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నారు. ఆయన బుధవారం రాత్రే ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నారావారిపల్లె సంక్రాంతి వేడుకల్లో చంద్రబాబు దంపతులు, బంధువులు పాల్గొన్నారు. తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా ఈ వేడుకల్లో చంద్రబాబు పట్టు పంచెలో కనిపించారు. కుటుంబ సమేతంగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత చంద్రబాబు తన తల్లిదండ్రులకు నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు బాబు ఇంటికి చేరుతుండడంతో సంక్రాంతి కోలాహలం నెలకొంది.

కరీంనగర్‌ జిల్లాలో సంక్రాంతి వేడుకలు
కరీంనగర్‌ జిల్లాలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే భోగి మంటలు వేసి, ముగ్గులతో ముంగిళ్లు అలంకరించి సంక్రాంతి పండుగను ఎంజాయ్‌ చేశారు. సాయంత్రం పిల్లలు నగరంలోని సర్కస్ గ్రౌండ్, అంబేద్కర్ స్టేడియాల్లో పతంగులు ఎగురవేశారు.

వరంగల్‌ జిల్లాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు…
వరంగల్‌ జిల్లాలో అంబరాన్నంటాయి. కాజీపేటలోని బాలవికాస్‌లో 14 దేశాల విదేశీ వనితలు సంక్రాంతి వేడుకల్లో సందడి చేశారు. తెలుగు అమ్మాయిల్లా ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. రంగు రంగుల ముత్యాల ముగ్గులు వేసి ఔరా అనిపించారు. సంక్రాంతి పాటలకు డ్యాన్స్ లేశారు. గంగిరెద్దుల ఆటలతో నృత్యాలు చేశారు. తాము వేసిన ముగ్గులను తమ కెమెరాల్లో బంధించుకుని.. ఆనందించారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటూ విదేశీ వనితలు మురిసిపోయారు.

కాకినాడలో జోరుగా కోడిపందాలు
కాకినాడలో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. పందెం రాయుళ్లు నోట్ల కట్టలతో రెచ్చిపోతున్నారు. భారీ ఎత్తున పందెం కాస్తున్నారు. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నా… పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప వాటిని నిలువరించలేకపోతున్నారు.

విజయవాడలో సంక్రాంతి సంబరాలు
విజయవాడలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మంత్రులు దేవినేని ఉమ, కొల్లురవీంద్ర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఉదయాన్నే భోగి మంటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పలు పంటలను ప్రదర్శనకు ఉంచారు. ఈ వేడుకల్లో సంస్కృతి కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

ఒంగోలులో సంక్రాంతి సంబరాలు
ప్రకాశం జిల్లా ఒంగోలులో సంక్రాంతి సంబరాలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రవాణ శాఖమంత్రి హాజరయ్యారు. ఈ వేడుకల్లో ముగ్గుల పోటీ, కబడ్డీ పోటీలు, ఎడ్ల పందేలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి.

వెలిగిపోయిన వేములవాడ రాజన్న, శ్రీశైలం మల్లన్న సన్నిధి
సంక్రాంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా వేములవాడ, కర్నూలు జిల్లా శ్రీశైలం మల్లన్న సన్నిధిలు వెలుగిపోయాయి.. పండుగరోజు భక్తులు అధిక సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తిరు వీధుల్లో స్వామివారిని ఊరేగించడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *