
రాష్ట్రంలోని 80 శాతం వరకు భూభాగానికి నీరందించే ప్రతిష్టాత్మక నీటిపారుదల ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం కావడం గర్వకారణంగా ఉందని అటవీ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీసీసీఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝా నేతృత్వంలోని 50 మంది అటవీ శాఖ అధికారుల బృందం భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో జరుగుతోన్న కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించింది. బుధవారం ఉదయం ప్రత్యేక బస్సులో హైదరాబాద్ నుంచి బయల్దేరిన అధికారులు ముందుగా వరంగల్ చేరుకొని అక్కడ కలెక్టర్ ఆమ్రపాలి, ఇతర అధికారులతో భేటీ అయ్యారు. అక్కణ్నుంచి భూపాలపల్లి చేరుకున్న అధికారులు… అటవీశాఖ కార్యాలయంలోని వుడెన్ హౌజ్ ను పరిశీలించారు. ఆ తర్వాత మేడిగడ్డ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనులను పరిశీలించడంతో పాటు ప్రాజెక్టు కోసం అటవీ భూముల బదలాయింపు, ప్రత్యామ్నాయ భూముల్లో అడవుల పెంపకం తదితర అంశాలపై క్షేత్ర స్థాయి పర్యటనలో వివరాలు తెలుసుకున్నారు. మేడిగడ్డ ఆనకట్ట, కన్నేపల్లి పంప్ హౌజ్ తో పాటు అన్నారం ఆనకట్ట పనులను అటవీశాఖ అధికారులు పర్యటించారు. ప్రతి సైట్ వద్ద ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్ట్ ఏజన్సీల ప్రతినిధులు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతలు, నీరు లిఫ్ట్ చేసే విధానం, పంపులు, మోటార్లు తదితర అంశాలతో పాటు పనుల పురోగతిని అటవీశాఖ అధికారులకు వివరించారు.
అటవీ శాఖ అధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనుల కోసం బదలాయిస్తోన్న అటవీ భూములు, వాటి స్థానంలో ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి సంబంధించిన ప్రణాళికలు తదితర వివరాలు ఆరా తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు అటవీ అధికారుల బృందం వచ్చిందని, ఈ ప్రాజెక్టు దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు అని పీసీసీఎఫ్ పీకేఝా అన్నారు. తెలంగాణకే ప్రాజెక్టు తలమానికంగా నిలుస్తుందని… ఇందుకోసం ఇప్పటికీ అటవీశాఖ తరపున అనుమతులు ఇచ్చినట్లు తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు, సీతారామ తదితర ప్రాజెక్టులు పూర్తైతే తెలంగాణలో 80 నుంచి 90 శాతం సాగులోకి వస్తుందని… ఈ ప్రాజెక్టుల్లో భాగం కావడం గర్వకారణంగా ఉందని అటవీశాఖ అధికారులు చెప్పారు. ప్రాజెక్టు పనుల కోసం విలువైన అటవీ భూములు పోతున్నప్పటికీ వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా పెద్దఎత్తున అడవుల పెంపకం చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. హరితహారంలో ద్వారా తగినంత పచ్చదనం పెంచుతామని చెప్పారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజక్టైన కాళేశ్వరానికి రికార్డు సమయంలో అనుమతులు సాధించినట్లు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో టన్నెల్ పనులను కూడా అటవీశాఖ అధికారులు పరిశీలించారు. పెద్దపల్లి కలెక్టర్ దేవసేనతో పాటు ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. టన్నెల్ పనుల వివరాలు తెలుసుకున్నారు.