
ప్రజల భద్రత కోసం కమీషనరేట్ లో పలు సంస్కరణలను అమలు చేస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలను అన్ని వర్గాల ప్రజలు, ప్రజాప్రతినిధులు తమవంతు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం నాడు కరీంనగర్ లోని కాశ్మీర్ గడ్డ, భగత్ నగర్ లో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంట్లో, కిరాణం దుకాణాలలో సోదాలు నిర్వహించారు. అనంతరం కాలనీ వాసులతో ఏర్పాటైన కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్ స్మార్ట్ సిటిగా ప్రకటించిన తర్వాత కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలు వేలాది కోట్ల రూపాయలను అభివృద్ధి కోసం మంజూరు చేశాయన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. తాజా ఆస్ట్ర్రేలియా ప్రభుత్వం కరీంనగర్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. యువత వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని కోరారు. ఉన్నత చదువులను అభ్యసిస్తూ ఉజ్వల భవిష్యత్ కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించకూడదని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందిగా మారిన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడాన్ని పూర్తిగా నియంత్రిస్తామని తెలిపారు. నేరాల చేధన, అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్పామని చెప్పారు. పోలీస్ స్టేషన్ లకు వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా అన్నివర్గాల ప్రజల సౌకర్యార్ధం హక్ఐ యాప్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ కలిగి ఉన్న ప్రతి పౌరుడు హక్ఐ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కోరారు. సిసి కెమెరాల ఏర్పాటు కోసం నేను సైతం కార్యక్రమంలో అన్నివర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పారు. వాహనాల కొనుగోలు సందర్భంగా వాహనదారులు పేరిట వాహనాలను రిజిస్ట్ర్రేషన్ చేసుకోవాలని సూచించారు. దొంగతనం, ప్రమాదాలు జరిగిన సందర్భాలలో ఇబ్బందులు ఏర్పడుతాయని తెలిపారు. కరీంనగర్ లో త్వరలో హైదరాబాద్ తరహలో ఈ చలాన్ విధానాన్ని అమలు చేయనున్నామని చెప్పారు. తమ ప్రాంతాల్లో గస్తీ నిర్వహించే బ్లూకోల్ట్స్ బృందాల ఫోన్ నెంబర్ లను తీసుకోవాలని తెలిపారు. ఏదైనా సంఘటన జరిగిన సందర్భంలో సమాచారం అందించినట్లయితే సంఘటన స్ధలానికి బ్లూకోల్ట్స్ బృందాలు చేరుకుంటాయని చెప్పారు. ఈ సందర్భంగా సరైన ధృవపత్రాలు లేని 53 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఎసిసి జె రామారావు, ఇన్స్ పెక్టర్లు మహేష్ గౌడ్, విజయ్ కుమార్, బి రవి, గౌస్ బాబా, ఆర్ఐ గంగాధర్, క్యూఆర్ టి, టాస్క్ ఫోర్స్, ఆర్ముడ్ రిజర్వ్ విభాగాలతో పాటు 150 మంది పోలీసులు పాల్గొన్నారు.