ప్రజల గొడవే కాళోజీ గొడవ : సీఎం కేసీఆర్

– తెలంగాణ భాషాదినోత్సవంగా కాళోజీ జయంతి
వరంగల్ : కాళోజీ కవిత్వం విశ్వజనీనమని, ప్రపంచ మానవాళి సమస్యలపట్ల పోరాటం చేసిన గొప్ప వ్యక్తి కాళోజీ అని సీఎం కేసీఆర్ అన్నారు. వాస్తవానికి కాళోజీ అన్నట్లు తనగొడవ కాదని, ప్రజల గొడవే ఆయన గొడవగా భావించారని సీఎం అన్నారు. వరంగల్‌లో నిర్వహించిన కాళోజీ శత జయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఇక నుంచి కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుందామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ భాషను, నుడికారాన్ని అతిగా ప్రేమించిన వ్యక్తి కాళోజే అని గుర్తు చేశారు. తన భాషే తెలంగాణ భాష అని నిక్కచ్చిగా చెప్పిన వ్యక్తి కాళోజీ అని పేర్కొన్నారు.

అన్యాయాన్ని ఎదిరించడంలో కాళోజీ నిర్మొహమాటంగా ఉండేవారని, మొహమాటం లేని తనం, నిష్కర్ష ఆయన సొంతమని చెప్పారు. విశ్వమానవాళి సమస్యలను తన సమస్యలుగా చేసుకుని పోరాటం చేసిన గొప్ప వక్తి, ఉన్నత శిఖరం కాళోజీ అని కీర్తించారు. నిజానికి ఇవాళ కాళోజీతో పాటు జయశంకర్ సార్ కూడా మన మధ్య ఉండి ఉంటే ఎంతో సంతోషంగా ఉండేదని, వారు మనమధ్య లేకపోవడం దురష్టకరమన్నారు.
కాళోజీ పుస్తకాలను ఇతర భాషల్లోకి అనువదించే ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తుందన చెప్పారు. కాళోజీ పేరిట స్టాంపును కూడా విడుదల చేయడానికి ప్రయత్నిస్తామని, ఈ విషయంపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకుంటామన్నారు.

కాళోజీది రాజీ పడని మనస్తత్వం : సీఎం
ప్రజా కవి కాళోజీది రాజీ పడని మనస్తత్వమని సీఎం కేసీఆర్ అన్నారు. అనుకుంటే చివరివరకు పోరాడేవారని, కాళోజీ ఏనాడూ పదవులకూ, డబ్బుకూ లొంగలేదని గుర్తు చేశారు. ఆయన కవిత్వం ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పారు. కాళోజీ మానవ కళ్యాణం కోసం పోరాడిన వ్యక్తి.. ఆయన స్పూర్తితోనే తెలంగాణ సాకారమైందన్నారు. కొసదాకా కొట్లాడు బిడ్డా అని తనను కాళోజీ ఆశీర్వదించారని గుర్తు చేశారు. కాళోజీకి స్వార్థం లేదు కాబట్టి.. ఆయన ఎవరికీ భయపడలేదని పేర్కొన్నారు. కాళోజీ సహచర్యంతో ఎంతో స్పూర్తి పొందానని తెలిపారు. జయశంకర్ సార్ కూడా కాళోజీ నుంచి స్పూర్తి పొందారని గుర్తు చేశారు. కాళోజీ పట్ల జయశంకర్‌సార్‌కు ఎంతో గౌరవం ఉండేదని చెప్పారు. కాళోజీ తర్వాత లెక్కించదగ్గ వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు.

రవీంద్రభారతిని మించే విధంగా కాళోజీ కళాక్షేత్రం
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిని మించే విధంగా కాళోజీ కళాక్షేత్రం ఉంటుందని సీఎం కేసీఆర్ చెప్పారు. కాళోజీ కళాక్షేత్రం కోసం రూ. 12 కోట్లు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాళోజీ కళాక్షేత్రం వరంగల్ నగరానికి అందమైన వరం లాంటిదని పేర్కొన్నారు. కాళోజీ కళాక్షేత్రానికి పరాయి పాలనలో 500 గజాల స్థలం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఇవాళ మూడున్నర ఎకరాల భూమిని ఇస్తున్నామని తెలిపారు. కళాక్షేత్రంలో లైబ్రరీతో పాటు అన్ని వసతులు కల్పిస్తామని హామీనిచ్చారు. కళాక్షేత్రం ఎదుట బ్రహ్మాండమైన కాళోజీ కాంస్య విగ్రహాం ఏర్పాటు చేస్తామన్నారు. 1500 మంది కూర్చునేలా భవనం ఏర్పాటు జరుగుతుందని చెప్పారు.

కాళోజీ కుటుంబానికి ఆర్థిక సహాయం: సీఎం
కాళోజీ కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కూడా ఇంకా ఈ దుస్థితి కొనసాగడం దారుణమన సీఎం కేసీఆర్ అన్నారు. వరంగల్ నిట్‌లో ఏర్పాటు చేసిన కాళోజీ శతజయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ.. కాళోజీ ఫౌండేషన్ పేరుమీద రూ.10 లక్షలు ఫిక్స్‌డిపాజిట్ చేయాల్సిందిగా కలెక్టర్ కిషన్‌ను కోరుతున్నా. ఈ నగదుపై వచ్చే వడ్డీని ప్రతినెల కాళోజీ కుటుంబానికి అందించాల్సిందిగా ఫౌండేషన్ సభ్యులను కోరుతున్నానని సీఎం పేర్కొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.