
నగర సమస్యలపై వివిధ సామాజిక మాద్యమాలు, పత్రికలు, మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను ప్రాధాన్యత అంశంగా గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నిర్వహణ విభాగం ఇంజనీరింగ్ పనులపై నేడు సూపరింటెండెంట్, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్లతో నేడు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్, అడిషనల్ కమిషనర్ ముషారఫ్ అలీ హాజరైన ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ నగర సమస్యలపై అందే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వాలని స్పష్టం చేశారు. ప్రధానంగా రోడ్ల పరిస్థితులు చేపట్టాల్సిన మరమ్మతులు, నిర్వహణ పై అందే ఫిర్యాదులపై ప్రత్యేకంగా వాట్సప్ గ్రూపులు ఏర్పాటుచేసి వాటిలో పోస్టు చేస్తున్నట్టు తెలిపారు. ఈ డెడికేటెడ్ వాట్సప్ గ్రూపుల ద్వారా అందే ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. ప్రతి ఇంజనీరింగ్ అధికారి తాముచేసే పనిపై ప్రతివారం ప్రత్యేకంగా సమిక్ష నివేదికలను రూపొందించుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను 65వేల మంది ఫాలో అవుతున్నారని అన్నారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ఖాళీ స్థలాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి పలు ప్రతిపాదనలు వస్తున్నాయని, ఈ విషయంలో పూర్తిస్థాయి డిమాండ్, నిర్వహణ వ్యయం, ప్రజోపయోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని వీటి నిర్మాణాలను చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న కమ్యునిటీహాళ్లు, ఫంక్షన్‌హాళ్లపై వెచ్చించిన వ్యయం, వాటి నిర్వహణ వ్యయం, నెలలో ఎంతమంది ఉపయోగిస్తున్నారు తదితర అంశాలపై అద్యయనం చేయాలని కమిషనర్ సూచించారు. నగరంలో ప్రస్తుతం ఉన్న 150 అన్నపూర్ణ ఐదు రూపాయల భోజన కేంద్రాలను ఆధునికరించనున్నామని, దీనిలో భాగంగా ప్రతి జోన్‌కు ఒక మోడల్ అన్నపూర్ణ క్యాంటీన్‌లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నగరంలో అక్రమంగా భవన నిర్మాణ వ్యర్థాలను వేసేవారిని గుర్తించి వారికి జరిమానాలు విధించాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టిన 24 స్మశానవాటికల ఆధునీకరణలో ఇప్పటి వరకు 17 శ్మశానవాటికల ఆధునీకరణ పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలినవి పురోగతిలో ఉండగా కొత్తగా మరో నాలుగు శ్మశానవాటికల ఆధునీకరణకు టెండర్లను ఆహ్వానిస్తున్నామని తెలిపారు.