హరితహరంపై పోలీసుల భారీ ర్యాలీ

హరాతహరం ప్రచార కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సోమవారంనాడు కరీంనగర్ లో భారీ ప్రదర్శనను నిర్వహించింది. వివిధ విద్యాసంస్ధలకు చెందిన ఎనిమిది వేలమంది విద్యార్ధులు, వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన జిల్లాస్ధాయి అధికారులతో ఈ కార్యక్రమం జరిగింది. జిల్లా జడ్జ్ బి. నాగమారుతిశర్మ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఎస్.ఆర్.ఆర్ కళాశాల నుండి ప్రారంభమైన ప్రదర్శన బ్యాంక్ కాలనీ, చైతన్యపురి, వావాలాలపల్లి, కోర్టు చౌరస్తా, కెప్టెన్ రఘునందన్ విగ్రహం, సర్కస్ గ్రౌండ్ ల
మీదుగా తెలంగాణ చౌక్ నకు చేరుకుంది. విద్యార్ధులు ప్లకార్డులు చేతబూని, మొక్కల పెంపకం ద్వారా కలిగే లాభాలను వివరిస్తూ నినాదాలతో ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో జిల్లా జడ్జ్ బి.నాగమారుతిశర్మ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి పౌరునిపై ఉందన్నారు. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేస్తే మానవమనుగడకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. హరితహరం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ నీతుకుమారి ప్రసాద్ మాట్లాడుతూ హరితహరాన్ని మహయజ్ఞంగా ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై
ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధుల భాగస్వామ్యం ఎక్కువగా ఉండాలన్నారు. విద్యార్ధులు చూపుతున్న ఆసక్తి ఆహ్వనించదగిన పరిణామమని పేర్కొన్నారు. జిల్లాలోని
అన్ని వర్గాల ప్రజల సహకారంతో లక్ష్యానికి మించి మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. జిల్లా ఎస్పీ డి. జోయల్ డేవిస్ మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతిపౌరుడు ప్రాధమిక హక్కుగా భావించి ముందుకురావాలని పిలుపునిచ్చారు. విద్యార్ధుల ఉత్సాహంతో లక్ష్యాన్ని ఎక్కువ చేసినా సులువుగా సాధిస్తామనే నమ్మకం ఏర్పడిందని పేర్కొన్నారు. పర్యావరణం పరిరక్షణ ద్వారా మానసిక ఒత్తిళ్ళనుండి ఉపశమనం లభించి, నేరాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి పౌరుడు కుటుంబసభ్యులతో మొక్కలు నాటించాలని కోరారు. పలు ఫలితాలను ఇచ్చే హరితహరం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు అయ్యేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.వో బి.చంద్రశేఖర్, డిఎస్పీ జె.రామారావు, ఎస్. ఆర్. ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ మధుసూధన్ రెడ్డి, అల్ఫోర్స్ విద్యాసంస్ధల ఛైర్మన్ నరేందర్ రెడ్డి, స్ధానిక పోలీసు అధికారులు కె. హరిప్రసాద్, సదానందం, మహేష్, శ్రీనివాస్, నరేందర్, సువర్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *