
ఖమ్మం : ఆంధ్ర – ఒడిషా సరిహద్దులో పోలీసుల కాల్పుల్లో ఓ అమాయకుడు బలయ్యాడు. మావోయిస్టులు అనుకొని.. గ్రేహౌండ్స్ దళాలు.. ఓ గిరిజనుడిని కాల్చి చంపేసాయి. ఏఓబీలో భారీ ఎన్కౌంటర్ జరిగిందని.. ఆ ఘటనలో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని సోమవారం మీడియాకు సమాచారం అందించారు. అయితే కాల్పులు జరిగింది వాస్తవమే అయినా మృతి చెందింది మావోయిస్టులు కాదు.. గిరిజనుడని తేలింది. గర్భవతి అయిన తన భార్యను చూసేందుకు వెళ్తున్న బుద్దపై పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసు కలదలికలను తెలుసుకున్న మావోయిస్టులు.. అక్కడి నుంచి తప్పించుకున్నారని సమాచారం. దీనిపై వివరాలు కోరగా పోలీసులు సమాధానం చెప్పడం లేదు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనే జరిగిన సంగతి తెలిసిందే. ఖమ్మం జిల్లా చర్ల మండలం దోసిల్లపల్లి వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గిరిజనుడు కారం నర్సింహరావు మృతి చెందిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల కోసం గాలిస్తుండగా మావోయిస్టులు ఎదురు కాల్పులు జరిపారని, ఎదురు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో గ్రామస్తులు నర్సింహరావుకు బుల్లెట్ తగిలిందని చెప్పారు.