
హైదరాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ, నూతన ఓటర్ల నమోదుకు నియమించిన పోలింగ్ బూత్ స్థాయి అధికారులు (బి.ఎల్.ఓ) తమ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రజాప్రాతినిధ్యం చట్టం 1950 సెక్షన్-32 ప్రకారం తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ హెచ్చరించారు. నేడు బంజారాహిల్స్‌లోని ముఫకంజ కాలేజ్‌లో నూతన ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని దానకిషోర్ అకస్మికంగా నేడు తనిఖీచేశారు. ఈ కేంద్రంలో బి.ఎల్.ఓగా నియమించిన జీహెచ్ఎంసీ శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎ.నగేష్ గైర్హజరు కావడంతో వెంటనే ఆయనను విధుల నుండి తొలగించి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 32వ సెక్షన్ అనుసరించి కేసులు నమోదు చేయాలని సంబంధిత ఓటరు నమోదు అధికారికి దానకిషోర్ ఆదేశాలు జారీచేశారు. ఈ సందర్భంగా నూతన ఓటరు నమోదుకు ఫారం-6 తో పాటు ఓటర్ల బదిలీకి సంబంధించి, మరణించినవారి ఓట్లను తొలగించేందుకుగాను దరఖాస్తులను సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం బంజారాహిల్స్ రోడ్ నెం-13లోని పోలింగ్ కేంద్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను దానకిషోర్ తనిఖీచేశారు. తమకు కేటాయించిన ప్రాంతాల్లో విధినిర్వహణపై నిర్లక్ష్యం వహించడం, గైర్హాజరయ్యే బి.ఎల్.ఓలకు ప్రజాప్రాతినిద్య చట్టం సెక్షన్-32ను అనుసరించి జైలు శిక్షతో పాటు నగదు జరిమానా విధించడం జరుగుతుందని కమిషనర్ హెచ్చరించారు. ఎన్నికల సంబంధిత విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే బి.ఎల్.ఓల పై తీసుకునే చర్యలపై కోర్టులు కూడా జోక్యం తీసుకోవని పేర్కొన్నారు. హైదరాబాద్ జిల్లాలో నియమితులైన బూత్ లేవల్ అధికారులందరూ ఓటర్ల జాబితా సవరణలో పాల్గొనాలని జిల్లా ఎన్నికల అధికారి పేర్కొన్నారు.