‘పైరవీల్లో సీఎం చెప్పినా వినను’

ప్రతిభకే పట్టం కడతాం.. నిరుద్యోగులకు న్యాయం చేస్తాం
టీఎస్ పీఎస్ సీ చైర్మన్ ఘంటా చక్రపాణి స్పష్టీకరణ
హైదరాబాద్‌, ప్రతినిధి :  పైరవీలకు తావివ్వను.. ఈ విషయంలో సీఎం చెప్పినా వినను. ఉద్యోగాల భర్తీలో రాజకీయ జోక్యానికి తావులేదు. విద్యార్థుల ప్రతిభకే పట్టం కడతాం. నిరుద్యోగులకు న్యాయం చేస్తాం. నేను ఎవరి మాటా వినను కాబట్టే.. సీఎం కేసీఆర్‌ నన్ను టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమించారు  అని అన్నారు ప్రొఫెసర్‌ ఘంటా చక్రపాణి. టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కమిషన్‌ కార్యాలయంలో ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు చక్రపాణి, అసెంబ్లీ ఎదురుగా గల అమరవీరుల స్థూపం వద్ద.. ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌, ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తదితరులతో కలిసి నివాళులు అర్పించారు.

అనంతరం సర్వీస్‌ కమిషన్‌లో సన్మానం అందుకున్నారు. చైర్మన్‌ పదవిని బాధ్యతగా స్వీకరిస్తున్నానని, సర్వీసులో ఉన్నంత కాలం నిజాయితీగా వ్యవహరిస్తానన్నారు. టీఎస్‌పీఎస్సీ కొత్తగా ఏర్పడినందున భర్తీప్రక్రియ విధానాలు రూపొందించుకునేందుకు కొంత సమయం పడుతుందన్నారు. నాలుగైదు నెలల్లో ఉద్యోగాల భర్తీకి దశలవారీగా నోటిఫికేషన్‌ లు జారీ చేస్తామన్నారు.   రాజకీయ జోక్యం లేకుండా ఉద్యోగాల భర్తీ సాగుతుందని, నిరుద్యోగులెవరూ కమిషన్‌ చుట్టు తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఫైరవీలకు తావులేదని, ఇంటర్వ్యూల కోసమే అభ్యర్థులు కమిషన్‌ కార్యాలయానికి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగ నియామక దరఖాస్తులన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయని, టీపీఎస్సీని దేశానికే ఒక మోడల్‌గా తయారు చేస్తానని ఘంటా చక్రపాణి అన్నారు. అవినీతికి తావులేకుండా ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ఉద్యమంలో చుక్కానిలా ఉన్న సి.విఠల్‌, డాక్టర్‌ చంద్రావతి సభ్యులుగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.