
పూణే, ప్రతినిధి: కనీసం పసివాడని కనికరం కూడా లేదు… వీధి బాలుడని జాలి కూడా లేదు… మానవత్వం మరిచి స్టోర్ లోపలికి వచ్చాడని బయటకు గెంటేశారు పూణేలోని ‘మెక్ డోనాల్డ్స్’ రెస్టారెంట్ సిబ్బంది.
పూణేకి చెందిన షహీన అనే అమ్మాయి తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా ‘మెక్ డోనాల్డ్స్’ రెస్టారెంట్ కి వెళ్ళింది. కోక్స్ ఆర్డర్ ఇచ్చారు. అవి తాగుతుంటే ఒక వీధి బాలుడు పదేపదే వాళ్ళని చూస్తున్నాడు. ఆ బాలుని చూపులకు చలించి ‘నీకు కూడా కావాలా ?’ అని అతన్ని అడిగి, కోక్ కోసం తనతో పాటు లైన్ లో నిలబడుమని చెప్పింది షహీన. పిల్లాడితో పాటు షహీన కూడా లైన్ లో నిల్చుంది. దీంతో, అందరూ చూస్తుండగానే మెక్ డోనాల్డ్స్ సిబ్బంది ఒకరు వచ్చి కాలర్ పట్టుకొని ఆ పిల్లాన్ని లైన్ లో నుంచి బయటికి లాగాడు. అలానే బయటికి గెంటేశాడు. అంతేకాకుండా ‘ఇలాంటి వాళ్ళకు ఎంట్రీ లేదు’ అని చెప్పాడు. దీంతో, షాక్ అయిన షహీన ‘ఎందుకు ఇలా చశారు ?’ అని మెక్ డోనాల్డ్స్ సిబ్బందిని ప్రశ్నించింది. కానీ, వారి నుంచి సరైన సమాదానం రాకపోవడంతో సోషల్ మీడియాలో జరిగిందంతా ఫోటోలతో సహా పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు బాగా రెస్పాన్స్ రావడంతో విషయం కాస్తా ప్రభుత్వానికి తెలిసింది. దీంతో, ఈ ఘటనపై విచారణ చేయాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆదేశించారు. వివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారు.