
ఒక్కరోజు చికిత్సతో వ్యాధి నయం: డాక్టర్ రాజా
హైదరాబాద్ :- ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఇప్పుడు కాళ్లలో సిరలు అనే నరాలు వాచిపోయే వ్యాధి (వెరికోస్ వెయిన్స్ ) బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా నిలబడి వృత్తిధర్మాన్ని నిర్వర్తించే పోలీసులు, ఉపాధ్యాయులు, ఐటి ప్రొఫెషనల్స్, షాప్‌కీపర్స్ సెక్యూరిటీ సిబ్బందితో పాటు మహిళల్లో ఈ వ్యాధితో బాధపడేవారి సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. ప్రస్తుత జనాభాలో ఇటువంటి వ్యాధిగ్రస్తులు 20 శాతం వరకు ఉన్నారంటే ఆశ్చర్యం కలగకతప్పదు. నిలబడి పనిచేసేవారేగాక గర్భిణీలు, ఊబకాయం, అధికబరువు కలిగిన వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. కాళ్లలో చర్మం కింద ఉండే సూపర్ ఫిషయల్ సిరల్లో ఈ వ్యధి కనిపిస్తుంది. ప్రధానంగా మోకాలి నుంచి తొడలు ద్వారా గజ్జల వరకు ఉండేదాన్ని లాంగ్ సఫెనస్ వీన్స్ అని, కాలు వెనుక గల మడమ నుంచి మోకాలు కీలు వరకు గల భాగంలో సిరలు వాచిపోవడాన్ని షార్ట్ సఫెనస్ వీన్స్ వ్యాధిగా గుర్తిస్తారు. కాళ్లలో నొప్పి,బరువు, వాపు, కండరాలు బిగుతుగా మారడం, రంగుమారి, దురద, పుండ్లు పడడం వంటి లక్షణాలు కనిపించి తీవ్రంగా బాధిస్తాయి. నడవలేని పరిస్థితులు ఏర్పడతాయి. దీనికి సంబంధించి దక్షణాది రాష్ట్రాలలోనే అత్యధిక ఆపరేషన్లు చేసే జూబ్లీ హిల్స్ రోడ్‌నెంబర్ 1లో గల ఎవిస్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ రాజా మాట్లాడుతూ విదేశాలలో ముఖ్యంగా అమెరికా, లండన్ వంటి దేశాలలో నూతన ఆపరేషన్ ప్రక్రియలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ నూతన విధానం వల్ల సూదిని వైర్ ద్వారా పంపి వెయిన్స్‌ను కరిగించి వేయవచ్చునన్నారు. కేవలం ఒక్కరోజులోనే ఈ ఆపరేషన్ పూర్తయి రోగి అదే రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్లవచ్చునని వివరించారు. ఆపరేషన్‌కు 3-4 గంటల ముందు ఎటువంటి ఆహారం తీసుకోరాదని, ఆపరేషన్ పూర్తయిన తర్వాత వారం పదిరోజుల్లో ఒకసారి, నెలరోజుల తర్వాత మరోసారి చెకప్ చేయించుకోవాల్సిఉంటుందని వివరించారు. ఇది వంశపారంపర్యంగానూ వస్తుందని, గర్భిణీలలో తొలుత కనిపించినా తర్వాత తగ్గుతుందన్నారు. వయసుతో పాటు ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉందని డాక్టర్ రాజా చెప్పారు. నిరంతరం నడక, జాగింగ్, ఈత, సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్ల ఈ వ్యాధి రాదని తెలిపారు. ఒకవేళ నరాలు వాచి బాధ పెడితే కాళ్లు ఎత్తులో పెట్టుకుని పనిచేయాలని, పడుకునేటప్పుడు కాళ్లు కింద ఎత్తుపెట్టుకోవాలని డాక్టర్ రాజా చెప్పారు. డేకేర్ సెంటర్‌గా సేవలందిస్తున్న తమ ఆసుపత్రిలో కేవలం ప్యాకేజీ మేరకు ఆపరేషన్లు జరుగుతాయని, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. సేవా వృత్తిలో ఉన్నవారికి ఉచిత స్క్రీనింగ్ టెస్టుల సౌకర్యాన్ని అందిస్తున్నట్లు డాక్టర్ రాజా తెలిపారు.