
కోరుట్ల: కోరుట్ల మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు కార్పోరేట్ స్ధాయిలో ఆధునిక హంగులతో నెల రోజుల్లో పక్కా భవనం కోసం 7 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తానని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. కోరుట్ల నియోజక వర్గంలో 10 కోట్ల రూపాయలతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శుక్రువారం శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 5.18 కోట్లతో నిర్మించిన కోరుట్ల పాలిటెక్నిక్ కాలేజిని ప్రారంభించారు. అనంతరం కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజిలో 98 లక్షలతో మంజూరు అయిన 5 అదనపు తరగతి గదులకు శంకుస్ధాపన చేశారు. అలాగే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో 2.42 కోట్లతో మంజూరు అయిన ప్రహరి గోడ నిర్మాణం, అదనపు తరగతి గదులకు మంత్రి శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు భవనాలు లేక ఇంత అద్దాన్న పరిస్ధితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. 33సం!!ల క్రితం ప్రారంభించిన ఈ పాఠశాలకు గదులు లేక షెడ్లల్లో నిర్వహిస్తున్నారని, ఇది గత ప్రభుత్వాల పాలనకు నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పధకాల అమలుతో పాటు విద్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యత నిస్తుందని అన్నారు. ఈ పాఠశాలకు ‘‘ఎకరాల స్ధలం’’ఉందని వెంటనే లేఅవుట్ చేసి మంచి తరగతి గదులు, సిబ్బంది క్వాటర్లు, డార్మెటరీ, లైబ్రరీ, ప్రయోగ శాల, విద్యార్ధులు వసతి నిర్మాణాలకు ప్లాన్ తయారు చేసి అంచనాలతో వెంటనే ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. పక్కా భవనానికి ఎన్ని కోట్లు అయినా నెల రోజుల్లో మంజూరు చేస్తానని మంత్రి హమి ఇచ్చారు. పాఠశాల ప్రహరి గోడ నిర్మాణం నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్.సి., ఎస్.టి, మైనార్టీ పేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించుటకు ముఖ్యమంత్రి 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేశారని మంత్రి తెలిపారు. అవి అన్నియు ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి గురుకుల పాఠశాల నిర్మాణానికి 20 కోట్లు చొప్పున 5 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఈ పాఠశాలలో బోదన, బోదనేతర సిబ్బందిని 7500 మందిని నియమిస్తామని తెలిపారు. 250 గురుకుల పాఠశాలలో లక్షా 60 వేల మంది పేద విద్యార్ధులకు తూగే బోదనలో నాణ్యమైన విద్యను అందిస్తామని తెలిపారు. బి.సి. విద్యార్ధులకు వారి కోరిక మేరకు ముఖ్యమంత్రి 50 గురుకుల పాఠశాలలు మంజూరు చేశారని అవి కూడా ఈ విద్యా సం!! నుండి కొనసాగుతాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వ పూర్వ వైభవం తెస్తుందని తెలిపారు. అన్ని పాఠశాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆంగ్ల విద్యా బోదన ప్రవేశపెట్టామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్ధులను ఎక్కువ మందిని చేర్పించుటకు అందరు సమిష్టిగా కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ చీప్ విప్ కొప్పుల ఈశ్వర్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు తుల ఉమ, కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జగిత్యాల సబ్-కలెక్టర్ శశాంక్, కోరుట్ల మున్సిపల్ చైర్మన్ వేణు తదితరులు పాల్గొన్నారు.