పెండింగ్ గోదాములు మార్చి చివరికల్లా పూర్తి చేయాలి.

హైదరాబాద్ :

పెండింగ్ గోదాములు మార్చి చివరికల్లా పూర్తి చేయాలి.

యాసంగి దిగుబడులకు మార్కెట్లను సిద్ధం చేయాలి.

రైతులకు మద్దతు ధర రావలసిందే.

మద్దతు ధర కన్నా తక్కువ పలికితే ప్రభుత్వ ఏజన్సీలు రంగంలో దిగాలి.

రైతు కంట కన్నీరు తగదు .

పొరుగు రాష్ట్రాలలో మార్కెటింగ్ స్థితిగతులపై నిరంతర సమీక్ష .

ధరల స్థిరీకరణకు చర్యలు తీసుకోవాలి .

మార్కెటింగ్ శాఖ సమీక్ష సమావేశంలో మంత్రి హరీశ్ రావు .

———————–

రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద గోదాముల పూర్తికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన గ్రాంట్132 కోట్ల రూపాయల కోసం కృషి చేయాలని మార్కెటింగ్ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. గురువారంనాడు మార్కెటింగ్ డైరక్టర్ కార్యాలయంలో మూడు గంటలకు పైగా సమీక్షించారు. కేంద్రం ఆర్ కె వి వై కింద 264 కోట్లు గ్రాంట్ ఇచ్చింది. 132 కోట్లు రాష్ట్రానికి అందాయి. పూర్తయిన గోదాముల యుటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించి మిగతా నిధుల కోసం ప్రయత్నించాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొత్తం 330 గోదాములలో 200 పూర్తయినాయి. మిగిలిన 130 గోదాములను మార్చి చివరి వరకు పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. 8 చోట్ల భూ వివాదాల వల్ల గోదాముల నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తినందున ఆ ప్రాంతాలలో ప్రత్యామ్నాయ స్థలాలలో వాటిని నిర్మించేందుకు ఆయన అనుమతించారు. రబీ సీజన్ లో ఈసారి దిగుబడులు అనూహ్యంగా పెరగనున్నట్టు అంచనాలు వున్నందున ఈ మేరకు మార్కెట్ యార్డులలో ఏర్పాట్లు, గోదాములు, ఇతర అంశాలపై సన్నాహాలు ప్రారంభించాలని మంత్రి కోరారు. మార్కెటింగ్, వ్యవసాయ, ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ తదితర సంస్థలతో వీలైనంత త్వరగా ఒక సమన్వయ సమావేశాన్ని నిర్వహించాలని మంత్రి సంబంధిత శాఖల అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రబీలో కనీసం 28 లక్షల నుంచి 30 లక్షల మెట్రిక్ టన్నుల వరకు పంట దిగుబడి రావచ్చునని మంత్రి అభిప్రాయపడ్డారు. కందులు, శనగలు, వేరుశనగలు, పత్తి, మిర్చి, ఉల్లి తదితర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రస్తుతం మార్కెట్లలో లభిస్తున్న ధర, రైతులు ఎదుర్కుంటున్న ఇతర సమస్యలను మంత్రి సమీక్షించారు. మద్దతు ధర కంటే పంటలకు ధరలు తగ్గిన మరుక్షణం ప్రభుత్వ సంస్థలు రంగంలో దిగాలని కోరారు. ఎట్టి పరిస్థితులలోనూ రైతులకు మద్దతు ధర లభించవలసిందేనని అన్నారు. పొరుగు రాష్ట్రాలలో ధరల స్థితిగతులపై నిరంతరం మానిటరింగ్ చేయాలని అధికారులను కోరారు. ధరల స్థిరీకరణపై పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర కొత్త మార్కెట్ చట్టం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే తీసుకు రానున్నట్టు మంత్రి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో మార్కెటింగ్ డైరక్టర్ లక్ష్మీ బాయి, ఓఎస్ డి జనార్దన్ రావు, ఎన్.ఇ. నాగేశ్వరరెడ్డి , లక్ష్మణుడు, పద్మ హర్ష తదితర అధికారులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *