Breaking News

పుష్కరాల్లో వీఐపీ, స్పెషల్ దర్శనం రద్దు..

KCR

గోదావరి పుష్కరాల సందర్బంగా నది ఒడ్డున ఉన్న దేవాలయాల్లో విఐపి దర్శనాలు, స్పెషల్‌ దర్శనాలు, టికెట్‌ దర్శనాలు పూర్తిగా రద్దు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. పుష్కరాలపై క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డిజిపి అనురాగ్‌శర్మ తో పాటు ఇతర అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ధర్మపురి, కాళేశ్వరం పర్యటించి వచ్చిన డిజిపి అక్కడి పరిస్థితిని చెప్పారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తుల రద్దీ వివరాలను సిఎస్‌ చెప్పారు. గోదావరి నది ఒడ్డున, గోదావరికి వెళ్లే మార్గంలో ఉన్న దేవాలయాల్లో పుష్కరాలు ముగిసే వరకు విఐపి దర్శనాలు రద్దు చేయాలని ఆదేశించారు. ఏ దేవాలయంలో కూడా స్పెషల్‌ దర్శనాల కోసం టికెట్లు అమ్మవద్దని ఆదేశించారు. భక్తులందరికి ఉచిత దర్శనం మాత్రమే కలిగించాలని చెప్పారు. విఐపిలు కూడా సాధారణ భక్తుల మాదిరిగానే దర్శనం చేసుకోవాలని సూచించారు. దర్శనం టికెట్ల అమ్మకాలు తక్షణం ఆపివేయాలని చెప్పారు. ఈ ఆదేశాలు నూటికి నూరు శాతం అమలు అయ్యేలా చూడాలని దేవాదాయ కమిషనర్‌ శివశంకర్‌ను ఆదేశించారు. భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వర, బాసరలతో పాటు అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉందని, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని సిఎం చెప్పారు. గురువారం కూడా పుష్కర ఘాట్లను సందర్శించాలని డిజిపిని ఆదేశించారు.
పుష్కరాలకు భక్తుల రద్దీ పెరుగుతున్నందున విఐపి దర్శనాలు, టికెట్‌ దర్శనాలు రద్దు చేస్తున్నామని, అందరికీ ధర్మ దర్శనమే అని సిఎం చెప్పారు.
తాలిపేరుకు వరద నీరు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నందున భద్రాచలం వద్ద నదీ ప్రవాహ ఉదృతి పెరిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. దానికి తగినట్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఖమ్మం కలెక్టర్‌, ఎస్‌పీలను ఆదేశించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *