
అటవీ, జంతుజాలం రక్షణ కోసం పకడ్భందీ ప్రణాళిక
వాలంటీర్లు, స్వచ్చంద సంస్థల సహకారంతో పర్యావరణ చర్యలు
అడవులు, జంతువులకు హానిచేసేవారిపై కఠిన చర్యలు, అపరాధ రుసుము(ఫైన్) పెంపు యోచన
అడవి, జంతుజాలం రక్షణ కోసం కొన్ని విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని తెలంగాణ అటవీ శాఖ నిర్ణయించింది. పర్యావరణ సమతుల్యతలో భాగంగా పచ్చని అడవిని కాపాడుకోవటం అందరి బాధ్యత అని అటవీ శాఖ ఉన్నతాధికారులు గుర్తుచేశారు. వారం రోజుల పాటు జరిగిన పులులు, జంతుగణనలో పాల్గొన్న వాలంటీర్లతో అటవీ శాఖ ఉన్నతాధికారులు అరణ్య భవన్ లో సమావేశం అయ్యారు. వందలాది మంది వాలంటీర్ల నుంచి అడవుల్లో పరిస్థితులు, జంతుజాలం రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. అడవిలో గడిపిన వారం రోజుల తమ అనుభవాలను వాలంటీర్లు ఈ సందర్భంగా ఉత్సాహంగా వివరించారు. అలాగే తమవైపు నుంచి విలువైన సలహాలు, సూచనలు కూడా అందించారు. స్వచ్చందంగా పులుల గణనలో పాల్గొన్న వాలంటీర్లను అందరినీ అటవీ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. వాలంటీర్లలో డాక్టర్లు, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, రిటైర్డ్ ఉద్యోగులు కూడా ఉండటం శుభపరిణామం అన్నారు. సర్వేలో పాల్గొన్న అందరికీ ప్రోత్సాహక సర్టిఫికెట్లను అటవీ శాఖ తరుపున అందించారు. జంతుగణన సందర్భంగా అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ లతో సహా అన్ని ప్రాంతాల్లో అటవీ జంతువుల సంఖ్య ప్రోత్సాహకరంగా ఉన్నట్లు, గతంతో పోలిస్తే వాటి సంఖ్య పెరిగినట్లు అధికారులు గుర్తించారు. మూడు చోట్ల వాలంటీర్ల బృందాలకు పులి నేరుగా కన్పించటం కూడా గొప్ప పరిణామం అన్నారు. ఈ గణనను పూర్తి శాస్రీయంగా విశ్లేషించి, జంతువుల కచ్చితమైన లెక్కలు అందుబాటులోకి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో అడవులను, జంతువులను రక్షించుకునేందుకు తక్షణం కొన్ని చర్యలను ఈ సమావేశంలో ప్రతిపాదించారు.
*సమావేశంలో చర్చించిన కొన్ని ముఖ్యమైన విషయాలు*
*అడవుల పునరుజ్జీవం, వన్యప్రాణుల రక్షణ కోసం తగిన చర్యలు, అటవీ శాఖతో పాటు స్వచ్చంద సంస్థలు, వాలంటీర్ల సహకారం.
*అడవుల్లో జంతువుల నీటి లభ్యత పరిశీలన, మరింత సౌకర్యవంత కోసం ప్రత్యేకంగా ఒక సర్వేను నిర్వహించి, వేసవికి ముందే కార్యాచరణ.
*అడవుల్లో మానవ ఆవాసాలు, మానవ, పెంపుడు జంతువుల సంచారం వీలైనంత తగ్గించే చర్యలు.
*అడవుల గుండా సురక్షిత ప్రయాణ ఏర్పాట్లు, అమ్రాబాద్ అడవిలో ప్రయాణికులు కేవలం నిర్దేశించిన ప్రాంతాల్లోనే ఆగేలా చర్యలు, ఎనిమిది ప్రాంతాలు గుర్తింపు, కూర్చొనేందుకు తగిన వసతి, నీటి సౌకర్యం ఏర్పాటు.
*అడవుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల నియంత్రణ, మద్య పానం అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు. వాహనాల తనిఖీ. అటవీ ప్రాంతాల్లో షాపులు, హోటళ్లు నిర్వహించే వారితో ప్రత్యేక సమావేశాలు. ( హైదరాబాద్- శ్రీశైలం దారిలో అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ లు)
*అడవుల్లో చేయాల్సిన, చేయకూడని విషయాలతో చెక్ పోస్టుల వద్దే అందరు ప్రయాణీకులకు కరపత్రం
పంపిణీ.
*అడవుల్లో అగ్ని ప్రమాదాలకు, ఇతర విధాలుగా నష్టపరిచే చర్యలపై చట్ట ప్రకారం కఠిన చర్యలు. అపరాధ రుసుము ( ఫైన్ ) భారీగా పెంపు ప్రతిపాదన.
*అడవుల్లో వాహనాల వేగానికి అడ్డుకట్ట, స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు, రానున్న రోజుల్లో స్పీడ్ గన్స్ ప్రయోగం
పరిశీలన.
*స్థానిక గూడేలు, చెంచులకు అడవుల రక్షణపై అవగాహనా కార్యక్రమాలు, వారి పిల్లల్లో చైతన్యం కోసం స్వచ్చంద సంస్థల సహకారం.
*చెట్లు కొట్టివేత, వ్యవసాయం కోసం అడవిని నరికివేతపై కఠిన చర్యలు.
*అటవీ జంతువులు, వన్య మృగాలకు వేటకు అనువైన జంతు సంపద పెంపుకోసం ప్రత్యేక చర్యలు, శాఖాహార జంతువులకు అవసరమైన గడ్డి, నీటి సౌకర్యం పెంచే చర్యలు.
*అటవీ ప్రాంతాల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు సేకరించే పనివారి సంఖ్య పెంపు, స్థానికులకు అవకాశం.
*అడవుల నరికివేత, జంతువుల వేట, స్మగ్లింగ్ కార్యకలాపాలను అడ్డుకునేందుకు స్థానికులకు అవగాహన, ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం ఇచ్చేలా చర్యలు.
*అడవుల్లో నీటి చెలిమలు, కాలువలు, నదుల కాలుష్య కారకాలను గుర్తించి, తక్షణం అడ్డుకట్ట వేయడం.
*పులుల సంచారం, ఆవాసాల వృద్ధి కోసం తగిన చర్యలు.
ఈ విషయాలను అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చిన వాలంటీర్లతో సుదీర్ఘంగా చర్చించారు. అటవీ శాఖకు పూర్తి సహకారం అందించేందుకు స్వచ్చంద సంస్థలు, వాలంటీర్లు పూర్తి మద్దతు ప్రకటించారు. సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారులు పీ.కే. ఝా, మనో రంజన్ భాంజా, మునీంద్ర, ఓఎస్డీ శంకరన్, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ వినోద్ కుమార్, శివానీ డోగ్రా పాల్గొన్నారు.