పీసీసీ పీఠం వద్దు బాబోయ్..!

హైదరాబాద్ , ప్రతినిధి :అధికారంలో ఉన్నప్పటికీ.. ప్రతిపక్షంలోకి వచ్చాక ఒకటే తేడా.. అప్పుడు పదవులు కావాలి.. ఇప్పుడు పదవులు తీసుకోం.. అధికారంలో ఉంటే నిధులు, నియామకాల్లో అంత ఇంతో డబ్బు పరపతి వస్తుంది.. అదే ప్రతిపక్షంలోనైతే ఓటములను మీదేసుకోవాలి.. జేబుల్లోంచి ఖర్చు చేయాలి.. అన్నింటికి బాధ్యత వహించాలి.. అందుకే కాంగ్రెస్ లో ఆరు నెలలు తిరగేసరికి ఎంత తేడా..  తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో..ఆపార్టీ హైకమాండ్‌కు ఎదురవుతున్న అనుభవం ఇది. గతంలో పీసీసీ చీఫ్ పదవి కోసం చాంతాడంతా లిస్ట్‌ ఉండేది. నేనంటే నేను అంటూ నేతలు పోటీపడే వాళ్లు. అయితే ఆపదవిని దక్కించుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టేనేతలు..ఇప్పుడు అటు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలకు ఏం చేయాలో అర్థంకావడంలేదు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలో పీసీసీ చీఫ్ పొన్నాలను తప్పించాలని డిసైడ్ అయిన హైకమాండ్‌కు .. ఇప్పుడు ఆ బాధ్యతలను ఎవరికి కట్టబెట్టాలన్నది పెద్ద సవాల్‌గా మారిందని టాక్.

పదవి కోసం ఆమడ దూరం…
అసలు పదవుల కోసం ఢిల్లీ పెద్దల కాళ్లూ, గడ్డం పట్టుకునే కాంగ్రెస్ నేతలు ..ఇప్పుడు ఎందుకు పీసీసీ చీఫ్ పదవి అంటే ఆమడ దూరం జరుగుతున్నారు. ఒక్క పోస్టుకు వందల మంది ఉండే ఆశావాహుల్లో ..ఇప్పుడు ఒక్కరంటే ఒక్కరు ఎందుకు ముందుకు రావడం లేదు..? అందులోనూ ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడి పోస్టు ఇస్తామంటే ఎందుకు వద్దంటున్నారు..? అవును దీనిపైనే ఇప్పుడు పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పార్టీకి అధికారం లేదు..ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అధ్యక్షుడిగా ఉండి పార్టీని నడపాలంటే.. ఆనేతకు కత్తిమీద సామే. అందులోనూ ఆర్థికంగా తలకుమించిన భారం అవుతుందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం పొన్నాలకు పార్టీ నిర్వాహణకు నెలకు 10లక్షలకు పైగానే ఖర్చు అవుతుందని గాంధీభవన్ వర్గాల సమాచారం. రాబోయే రోజుల్లో పార్టీ నడపాలంటే.. దీనికి రెండింతలు ఖర్చవడం ఖాయం. కాబట్టి ఇప్పటికే ఓడిపోయి ఖర్చుల్లో ఉన్నాం ఇప్పుడు మళ్ళీ దీన్ని మెయింటెన్ చేయడం మావల్ల కాదని పార్టీలోని ముఖ్య నేతలే చేతులెత్తేస్తున్నారు.

ఎమ్మెల్సీ కోసం ఆరాటం ….
అయితే పీసీసీ పదవిని వద్దంటున్న నేతలు ..ఎమ్మెల్సీ పదవి కోసం మాత్రం తెగ ఆరాటపడుతున్నారు. మార్చిలో డీఎస్ ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తుండటంతో..ఈ నేతలందరు ఇప్పడికే ఢిల్లీ పెద్దల ముందు మోకరిల్లి తమ విజ్ఙప్తులు సమర్పించుకుంటున్నారు. ఇప్పడికే దామోదర రాజనర్సింహ, సర్వే సత్యనారాయణ, సురేష్ రెడ్డి, శ్రీధర్ బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్యలు తమకు ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించాలని పార్టీ అధినేత్రికి విన్నవించుకున్నట్లు సమాచారం. ఎలాగైనా ఎమ్మెల్సీని దక్కించుకుంటే..నెలకు జీతానికి జీతం..అధికార దర్పం..ఇంకా అదృష్టం కలసివస్తే.. మండలి పక్షనేతగా బుగ్గకారు యోగం ఉంటుందని కలలు కంటున్నారు నేతలు. పొన్నాల ఇప్పడికే ఢిల్లీ పెద్దలకు తన మనసులో మాటను చెప్పారని..ఇక ఉత్తం, జానా రెడ్డిలు పీసీసీ పదవిని తీసుకోవడానికి విముఖత చూపిస్తుంటే..డిఎస్ అయితే.. అధిష్టానం ఇస్తామన్నా తాను వద్దని చెబుతున్నానని బాహటంగానే అంటున్నారు.

జీర్ణించుకోలేకపోతున్న హైకమాండ్ పెద్దలు…
నిన్నటి వరకు అధికారాన్ని ఎంజాయ్ చేసిన నేతలే ఇప్పుడు ఈ పదవిని ముళ్లకిరీటంగా చూస్తుండటాన్ని హైకమాండ్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుస్తోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీకి కొత్త సారథి ఎవరవుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.