
జమ్మూ కాశ్మీర్, ప్రతినిధి : ఎన్నికలు అయిపోయాయి..ఫలితాలు వచ్చేశాయి..కానీ అధికారం ఎవరు చేజిక్కించుకుంటారన్న సస్పెన్స్ కొనసాగుతోంది. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో అస్పష్టత నెలకొంది. ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీలు మంకుపట్టు పట్టాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీ వ్యవస్థాపకుడు మహ్మద్ సయీద్‌కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జుగల్ కిషోర్‌లకు గవర్నర్ వోహ్రా వేర్వేరుగా ఆహ్వానం పంపారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలకు ఏ పార్టీ మద్దతిస్తుందనే ఉత్కంఠ నెలకొంది. ఆయా పార్టీల నిర్ణయాలు తెలిపేందుకు సమయం కూడా ఇచ్చినట్లు సమాచారం.
పీడీపీ 28..బీజేపీ 25 స్థానాలు..
87 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో పీడీపీకి 28 స్థానాలు దక్కగా.. బీజేపీకి 25, నేషనల్ కాన్ఫరెన్స్ కు 15, కాంగ్రెస్‌కు 12 సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటు చేసే ఛాన్స్ పీడీపీకి, బీజేపీకే ఉంది. అయితే బీజేపీని అధికారం దక్కకుండా మిగతా పార్టీలన్నీ పావులు కదుపుతున్నట్లు సమాచారం. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీకి మద్దతు తెలుపుతున్నాయి. ముందు బీజేపీకి మద్దతిస్తామన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఇప్పుడు మాట మార్చింది. బీజేపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. పీడీపీకి మద్దతిస్తున్నట్లు మౌఖికంగానే తెలిపామని ఒమర్ అబ్దుల్లా ట్విట్టర్లో తెలిపారు. తాము మద్దతు ఇస్తున్నట్లు లేఖ ఇవ్వలేదని పీడీపీ, బీజేపీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఒమర్ ట్విట్టర్లో కామెంట్ చేశారు. మరోవైపు బీజేపీ తీరుపై కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ మండిపడ్డారు. జమ్మూ కాశ్మీర్లో ప్రాంతీయ పార్టీలను అణగదొక్కాలని బీజేపీ చూస్తోందని అన్నారు.
సీఎం పదవికి కోసం పార్టీల మంకుపట్టు..
పీడీపీ, బీజేపీ కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయాలంటే సీఎం పదవి తమకే ఇవ్వాలని పీడీపీ పట్టుబడుతోంది. దీనికి బీజేపీ సిద్ధంగా లేదు. ఇక ఈ రెండు పార్టీలు కలిసి అధికారాన్ని ఏర్పాటు చేయడం అసాధ్యంగా మారింది. మరోవైపు పీడీపీతో పొత్తు ఎక్కువకాలం నిలువదని ఆరెస్సెస్ వర్గాలు చెబుతున్నాయి. ఎన్సీతో చేతులు కలపాలని సూచిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో హిందువును ముఖ్యమంత్రిని చేయాలని బీజేపీ చూస్తోంది. అయితే దీనికి నేషనల్ కాన్ఫరెన్స్ సుముఖంగా లేదు. ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు రాజ్యసభ సీటు, కేంద్రంలో ఒక మంత్రి పదవి ఇస్తామని బీజేపీ ఎన్సీకి ఆశచూపుతున్నట్లు సమాచారం. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది. జమ్మూ కాశ్మీర్ రాజకీయం ఏ దిశగా సాగుతుందో వేచి చూడాలి.