
లక్నో, ప్రతినిధి : ‘పీకే’ సినిమా వివాదంలో తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇరుక్కున్నారు. యూపీలో పీకే సినిమా ప్రదర్శనపై ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఎత్తివేసిన సీఎం… ఈ సినిమా చాలా బాగుందంటూ గొప్పగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సినిమా గొరించి గొప్పగా చెబితే తప్పులేదు కానీ.. ఆ గొప్పల్ని చెప్పే క్రమంలోనే సీఎం గారు అసలు పొరపాటు చేశారు. అందరూ ఈ సినిమా బాగుందని చెబుతుంటే తాను కూడా ఈ సినిమా చూడాలని భావించాను. అందుకే ఎప్పుడో ఈ సినిమాని డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. కానీ బిజీ షెడ్యూళ్ల కారణంగా అప్పటి నుంచి ఈ సినిమాని చూడలేకపోయాను. ”నిన్ననే రాత్రి ఆ డౌన్లోడ్ వెర్షన్ని చూశాను. సినిమా బాగుంది కనుక ఈ సినిమాని అందరూ చూడాలనే ఉద్దేశంతో వినోద పన్నురాయితీ ఇచ్చాను” అని వ్యాఖ్యానించారు.
ఇదే వార్త మీడియాలో రావడం చూసి ఉత్తరప్రదేశ్ రాష్ర్ట వాసులు అవాక్కయ్యారు. అదేంటి.. సినిమాని ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని చూడటం నేరం కదా అని నిలదీస్తున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తల్ని కట్ చేసి వాటినే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సీఎం సారు పొరబాటుని ఎత్తిచూపిస్తున్నారు.
ఇదిలావుంటే, సోషల్ మీడియా ప్రచారంపై స్పందించిన సీఎం కార్యాలయం.. అదే ట్విట్టర్ ద్వారా డ్యామేజీ కంట్రోల్ చర్యలకు పూనుకుంది. సినిమాల్ని డౌన్లోడ్ చేసుకుని చూసే విధంగా సీఎం గారు లైసెన్స్ పొందారని.. అందువల్ల ఇక ఇది పైరసీకి సంబంధించిన అంశం ఏమాత్రం కాబోదంటూ పేర్కొంది. అయితే, ఈ వివరణపై సంతృప్తి చెందని వాళ్లు సీఎం గారు పైరసీకి పాల్పడ్డారని ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్లకు పరుగులుపెడుతున్నారు.