
ముంబై: బాలీవుడ్‌స్టార్ అమీర్‌ఖాన్ నటించిన పీకే చిత్రాన్ని బహిష్కరించాలని యోగా గురు బాబా రాందేవ్ పిలుపునిచ్చారు. హిందూ దేవతలను అవమానపరచే ఇలాంటి మూవీలను బాయ్‌కాట్ చేయాలన్నారు. ఆదివారం ముంబైని సందర్శించిన ఆయన – ఒకమతం గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడవలసి వస్తే ఎంతో సంకోచిస్తారని, కానీ హిందూ మతం మీద నిస్సంకోచంగా అవాకులు, చెవాకులు పేలడం, హిందూ దేవతలను కించపరచడం జరుగుతోందని అన్నారు.
ఇది చాలా సిగ్గుచేటని, ‘పీకే’ వంటి సినిమాలను ప్రజలు బహిష్కరించాలని కోరారు. తమను తాము సెలబ్రిటీలుగా, గొప్ప వ్యక్తులుగా చెప్పుకుంటున్న వాళ్ళు హిందూ దేవతలను, సాధువులను అవమాన పరచడాన్ని హాబీగా పెట్టుకున్నారు అని బాబారాందేవ్ వ్యాఖ్యానించారు. కాగా -‘పీకే’ చిత్ర దర్శక నిర్మాతలు కోరితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద సెక్యూరిటీ కల్పించాలని ముంబై పోలీసులు అన్ని స్థానిక పోలీసు స్టేషన్లను ఆదేశించారు. ఆదివారం కన్నాట్ ప్లేస్‌లో పీకే చిత్రాన్ని ప్రదర్శిస్తున్న సినిమా హాలు వద్ద విశ్వహిందూ పరిషద్‌కు చెందిన కొందరు కార్యకర్తలు నిరసన ప్రదర్శనకు దిగారు. ఈ మూవీ పోస్టర్లను చించివేసి ఆ థియేటర్ అద్దాలను బద్దలు గొట్టారు. పోలీసులు వచ్చేలోగానే అక్కడినుంచి వెళ్ళిపోయారు.