
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టి.టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పలు ప్రశ్నలు సంధించారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ఆయన పలు విమర్శలు సంధించారు. పాలన మంచిగుందని ఎవరు సర్టిఫికెట్ ఇచ్చారని ప్రశ్నించారు. కేవలం మామ..అల్లుళ్లు ఇచ్చుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి సభను పెట్టి పరిపాలన సక్సెస్ అయ్యిందని వారు సన్మానం చేస్తే సంతోషిస్తామన్నారు. అలా చేశారా ? అమరవీరుల కుటుంబాలు సంతోషంగా ఉన్నారా ? ఆ కుటుంబాలు నిరుత్సాహంలో ఉన్నాయన్నారు. 1200 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి 400..700 అని చెప్పారని విమర్శించారు. ఇలా చెప్పడం సిగ్గు అనిపించడం లేదా అని పేర్కొన్నారు. మీ కుటుంబం సంతోషంగా ఉంటే ప్రజలు సంతోషంగా ఉన్నారా ? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పరామర్శించావా ? అని హరీష్ రావును ఉద్ధేశించి ప్రశ్నించారు. ఇటీవల వరంగల్ మార్కెట్ కు ఉదయం పది గంటలకు హరీష్ రావు వెళ్లారని అలాగాక ఉదయం ఏడు గంటలకు రావాలని తాను చెప్పడం జరిగిందని ఎర్రబెల్లి పేర్కొన్నారు.