Breaking News

పశువుల కాపరి వేషంలో వినాయకుడు

Lord Ganesha Tiruchirappalli(1)

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన వినాయక దేవాలయం, తమిళరాడు రాష్ర్టంలోని తిరుచ్చి (తిరుచురాపల్లి) పట్టణంలో, కావేరీనదీ తీరానికి దగ్గరగా ఉన్న ఒక చిన్న కొండమీద ఉంది. 83 మీటర్లు ఎత్తుగా ఉండే ఈ కొండమీద ఉన్న ఈ వినాయక దేవాలయాన్ని సుమారు ఏడవ శతాబ్దంలో పల్లవ రాజులు పునర్నిర్మించారని చరిత్రకారులు చెప్తారు. ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయార్’ ఆలయం అంటారు. తమిళ భాషలో ‘ఉచ్ఛ’ అంటే ‘ఎత్తున’అని అర్థం. ఇక ‘పిళ్ళై..యర్’ అంటే ‘పిల్లవాడు ఎవరు’ అని అర్థం. శివుడు పార్వతీదేవి మందిరంలో ప్రవేశించబోతున్న సమయంలో, పార్వతీదేవి కాపలాగా ఉంచిన బాలుడు అడ్డగించగా, శివుడు కోపగించి ఆ బాలుని తల ఖండించి లోపలకు వెళ్ళడు. శివుడు, పార్వతిని కలవగానే అడిగిన మొదటి ప్రశ్న ‘పిళ్ళైయార్’. అంతవరకూ ఈ బాలునకు పేరే లేదు. ఆనాటి నుండి వినాయకునకు ‘పిళ్ళైయార్’ అనే పేరు స్ధిరపడిపోయింది. అందుకు ఈ ఆలయాన్ని ‘ఉచ్చ పిళ్ళైయర్ ఆలయం’ అంటారు. ఈ ఆలయం ఉన్న కొండ సుమారు 3800 మిలియన్ల సంవత్సరాలకు పూర్వందని చరిత్రకారుల అంచనా. ఈ ఆలయానికీ..శ్రీరంగం లోని రంగనాథస్వామి ఆలయానికీ ఎంతో అవినాభావ సంబంధం ఉంది. దానికి సంబంధించిన కథ ఏమిటంటే…. త్రేతాయుగ కాలంలో, శ్రీరామచంద్రుడు వానరులతో కలసి రావణుని మీదకు యుద్ధానికి వెళ్లినప్పుడు రావణ సోదరుడైన విభీషణుడు ఎంతో సాయం చేసాడు. ఫలితంగా శ్రీరాముడు  రావణుని సంహరించాడు. అందుకు కృతఙ్ఞతగా శ్రీరాముడు.. విభీషణునకు శ్రీమహావిష్ణువు అవతారమైన ‘శ్రీరంగనాథస్వామి’విగ్రహాన్ని బహూకరిస్తూ ‘విభీషణా.., లంకలో ఈ విగ్రహం ప్రతిష్ఠిచే వరకూ ఈ విగ్రహాన్ని నేలమీద పెట్టవద్దు’ అని చెప్పాడు . ఆ  విగ్రహం తీసుకుని విభీషణుడు లంకకు బయలుదేరాడు. అయితే విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకలో ప్రతిష్ఠించడం దేవతలకు ఇష్టం లేదు. అందుచేత దేవతలంతా వినాయకుని ప్రార్థించి తమ కోరిక చెప్పారు.

వినాయకుడు వారికి సహకరిస్తానని చెప్పి ఒక పశువుల కాపరి వేషం వేసుకుని, విభీషణునికి ఎదురుగా వస్తున్నాడు. అది సాయం సమయం. అస్తమయ సూర్యునకు అర్ఘ్యప్రదానం ఇవ్వాలని విభీషణుడు తలచి తన చేతిలోనున్న విగ్రహాన్ని నేల మీద పెట్టకూడదని, తనకు ఎదురుగా వస్తున్న పశువుల కాపరిని చూసి, దగ్గరకు  రమ్మని పిలిచి, తన చేతిలోనున్న విగ్రహాన్ని ఆ పిల్లవాని చేతిలో ఉంచి ‘ నేను పూజ పూర్తి చేసుకుని వచ్చే వరకూ ఈ విగ్రహాన్ని నేల మీద పెట్టకు’ అని చెప్పాడు. మాయా గణపతి సరే అన్నాడు. విభీషణుడు కావేరీనదిలో దిగి సంథ్యావందనం చేస్తున్నాడు. ఆ సమయం చూసి, విభీషణుడు ఎంత వద్దని చెప్తున్నా వినకుండా, ఆ విగ్రహాన్ని నేలమీద ఉంచి పరుగు తీసాడు. విభీషణుడు ఆ బాలుని తరుముతున్నాడు. ఆ బాలుడు కావేరీనది ఒడ్డున ఉన్న కొండ ఎక్కాడు. విభీషణుడు ఆ బలుని పట్టుకుని నుదుటి మీద గట్టిగా కొట్టాడు. (ఆ దెబ్బ తాలూకు మచ్చ ఇప్పటికీ ‘ఉచ్చ పిళ్ళైయార్’ విగ్రహానికి ఉండడం భక్తులు గమనించవచ్చు) అప్పుడు వినాయకుడు నిజరూపంతో విభీషణునికి దర్శనమిచ్చి, ‘శ్రీరంగనాథస్వామి విగ్రహం ‘శ్రీరంగ’ క్షేత్రంలో ప్రతిష్ఠితమౌ గాక. మన ఇద్దరి కలయికకూ గుర్తుగా నేను ఈ కొండమీద ఉంటాను’ అని వరమచ్చి ‘సూక్ష్మ గణపతి’గా ఆ కొండమీద వెలిసాడు. విభీషణుడు ఆ ‘సూక్ష్మ గణపతి’కి ఆలయం నర్మించాడు. ఆ ఆలయమే పల్లవుల కాలంలో అభివృద్ధి  చెందింది. అదే ప్రపంచంలోని అతి ప్రాచీన వినాయక దేవాలయం. తిరుచ్చిలోని ‘రాక్ ఫోర్ట్’ మీదవున్న ఈ ఆలయాన్ని దర్శించాలంటే 437 మెట్లు ఎక్కి వెళ్లాలి. ఈ మెట్లుకూడా చాలా ఎత్తుగా ఉంటాయి. రాక్ హిల్ ఎక్కి,ఈ ఆలయం దగ్గర నుంచి చూస్తే, తిరుచ్చి నగరం, కావేరీనది, శ్రీరంగం లోని ‘శ్రీరంగనాథస్వామి’ ఆలయం స్పష్టంగా కనిపిస్తాయి. ఇక, వినాయకుడు నేలమీద ఉంచిన ‘శ్రీరంగనాథుని’ విగ్రహాన్ని చోళరాజు కనుగొని ఆ విగ్రహాన్ని ‘శ్రీరంగం’లో ప్రతిష్ఠిచాడు. అదే శ్రీరంగం లోని ‘శ్రీరంగనాథస్వామి’ ఆలయం. ఈ ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాతే..‘ఉచ్చ గణపతి’ దేవాలయ ప్రతిష్ఠ జరిగింది. ఈ రెండు దేవాలయాలే ప్రపంచంలోని అతి ప్రాచీన దేవాలయాలు

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *