
హరితహరం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా ఎస్పీ డి.జోయల్ డేవిస్ ఆదివారం నాడు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డి.పి.టి.సి) లో మొక్కలను నాటారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 5,500మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకుని జిల్లా పోలీస్ శాఖ ముందుకుసాగుతోందన్నారు. శిక్షణ కేంద్రంలో నాటిన మొక్కలను ఈసందర్భంగా ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ డి.జోయల్ డేవిస్ మాట్లాడుతూ హరితహరం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములవుతూ ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ప్రాణవాయువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందన్నారు. హరితహరం కార్యక్రమం భాగంగా జిల్లా పోలీస్ శాఖ
57 గ్రామాలను దత్తత తీసుకున్న విషయం విదితమే. చెట్లను పెంచడం ప్రాధమిక హక్కుగా భావించి ప్రతి పౌరుడు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జీవకోటికి ప్రాణధారం పర్యావరణ పరిరక్షణని పేర్కొన్నారు. ఆత్మశుద్దితో చెట్లను నాటి వాటిని పరిరక్షిస్తూ వాటి ఫలాలు అనుభవించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పర్యావరణం పరిరక్షణ ద్వారా మానసిక ఒత్తిళ్ళ నుండి ఉపశమనం లభించి, నేరాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి పౌరుడు కుటుంబసభ్యులతో మొక్కలు నాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ బి.జనార్ధన్ రెడ్డి, డి.పి.టి.సి ఇన్స్ పెక్టర్ సీతారెడ్డి, ఆర్.ఎస్.ఐ రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.